బీజేపీ దృష్టి తెలంగాణ మీదనే ఎందుకు?

దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. క‌ర్ణాట‌క‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో  ఇంత వరకూ ఆ పార్టీకి   గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది.  బీజేపీ మిషన్‌ సౌత్‌కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.  రెండు దఫాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ప్రబలుతోందనడానికి  నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె   కవిత ఓడిపోవడంతో ప్రస్ఫుటమైందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

దీంతో 2019 ఎన్నికలు పూర్తయిన క్షణం నుంచీ బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో  17 స్థానాలకు గానూ బీజేపీ  కేవలం నాలుగింటిని గెలుచుకున్నప్పటికీ,   ఓట్ల శాతం 19 శాతానికి పైగా ఉంది.

ప్రతిపక్షంగా బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోవడంతో, బిజెపి ఆ గ్యాప్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉన్నప్పటకీ, రాష్ట్రంలో ప్రధాన విపక్షాని దీటుగా ఎదిగింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కి సన్నిహితంగా  ఏఉండటం కూడా బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.  అయితే బీజేపీ మాత్రం ప్రధానంగా తన విమర్శలకు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపైనే కేంద్రీకరించడం ప్లస్ పాయింట్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు.  

అన్నిటికీ మించి బీజేపీకి ఉన్న ప్రధాన ఆకర్షణ   ప్రధాన మంత్రి మోదీ. ఆయనకు ఉన్న జనాకర్షణ, వాగ్ధాటి. ఇటీవలి కాలంలో తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బీజేపీ ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా కూడా ప్రజలను ఆకర్షిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.

అలాగే  అర్బన్  ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత మెరుగైన అభివృద్ధి, ఉద్యోగావకాశాల వాగ్దానాలను ఉపయో గించి తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికీ అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగలే దని తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాలను కేసీఆర్ విఫలం చేస్తున్నారని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, కాళేశ్వరం వైఫల్యం, వర్గీకరణ అంశం, హామీల అమలు పూర్తి కాకపోవడం వంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది.