గోరంట్ల మాధవ్ పై చర్యలెందుకు తీసుకోవాలి?.. సజ్జల

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఎందుకు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన మాధవ్ పై చర్యలు తీసకోవాలంటూ తెలుగుదేశం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఢిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.   ఏపీ మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం ఆ వీడియోపై విచారణ జరిపి గోరంట్ల మధవ్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంతకు ముందు ఈ వీడియో వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఆయన మళ్లీ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకూ మాట్లాడలేదు. కానీ హఠాత్తుగా సోమవారం ( ఆగస్టు 8) సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలకుండా చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా  ఏడేళ్ల కిందటి ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ.. అప్పట్లో తెలుగేశం అదినేత గొంతుతో వచ్చిన ఆడియో విషయంలో  ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. గొరంట్ల అసభ్య వీడియో అంశం కంటే చంద్రబాబు వాయిస్ ఇష్యూయే పెద్దదని సూత్రికరించారు.

అయినా గోరంట్ల వ్యవహారంలో ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంత వరకూ ఆగాలని సజ్జల అన్నారు. గోరంట్ల అసభ్య వీడియో కాల్ బయటపడి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అసలు ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరిప్పలేదు. ఫోరెన్సీక్ దర్యాప్తు అంటూ సజ్జల ప్రకటించి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ  దర్యాప్తుపై ఒక్క అడుగు కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు.

తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడిని కనుకనే  తనపై వీడియో లీక్‌ చేశారంటూ మాధవ్‌   బీసీ కార్డు ప్రయోగించి తప్పించుకోవాలని చూశారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు  ఈ అంశానికి కులం కార్డు ఆపాదించి జనం దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా.. వైసీపీ, ముఖ్యమంత్రి జగన్  ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నది సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంతో తేలిపోయింది.  

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ వైసీపీలో అత్యంత కీలక పదవులు అనుభవిస్తున్న వారిపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంలో కూడ వైసీసీ నాయకత్వం ఇలాగే వ్యవహరించింది. కానీ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న నటుడు పృథ్వీపై మాత్రం చర్యలు తీసుకుంది.  పృథ్వీకి రాజకీయ అండదండలు లేకపోవడం వల్లే పూచిక పుల్లలా తీసిపారేశారని... వైసీపీలో బలమున్న వారికి ఒక రకం న్యాయం, బలహీనులకు మరో రకం న్యాయం అమలవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.