గోరంట్ల‌, అనంత‌బాబుల మీద ఎందుకంత ప్రేమ‌?..  రామ‌కృష్ణ‌

పొర‌పాట్లు చేసినా మంచివారిని కాపాడ‌ల‌నుకుంటారు. దొంగ‌ల్ని, అత్యాచారాలు చేసేవారిని, మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా వ్య‌వ‌హ రించే వారిని ర‌క్షించాల‌నీ అనుకోరు. కానీ వైసీపీ స‌ర్కార్ మాత్రం త‌మ ఎంపీ గోరంట్ల భాగోతం లోక‌మంతా తెలిసినా ఇంకా ఏదో ద‌ర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదిక‌లు రావాలి.. అంటూ తాత్సారం చేస్తూ కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. హత్య చేసిన ఎమ్మెల్సీ ని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయకుండా ఎమ్మెల్సీ అనంత బాబు కు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనక ఎవరు న్నార న్నారు. 

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ పకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ వీడియో అంటూ తేల్చారని రామకృష్ణ మండిపడ్డారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. అనంతబాబు కేసులో పోలీసు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమి స్తామని రామ కృష్ణ స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా, అశ్లీల వీడియో కాల్ ఆరోపణలు ఎదుర్కొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఢిల్లీ నుంచి వస్తున్న నేపథ్యం లో అనంతపురంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆరోపణలు నిరాధారమైనవని పోలీసులు తేల్చడంతో సొంత జిల్లాకి వస్తున్న ఎంపీకి భారీగా ఆహ్వానం పలికేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఆంధ్రా బార్డర్ నుంచి అనంతపురం వరకు వెహికల్స్‌తో ర్యాలీ చేపట్టేందుకు గోరంట్ల అభిమానులు సిద్ధమయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అనంతపురంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టీడీపీ నాయకు లను పోలీసులు ముందస్తు అరెస్టుల చేశారు.

గోరంట్లకు వ్యతిరేకంగా చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు అందించారు. అతనితో పాటు అనంతపురం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రమణకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు.