మాధవ గానమా? జగన్ మాయా?.. ఫకీరప్ప తీర్పు సారాంశమేమిటి మహాశయా?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వివాదంలో ఎస్పీ ఫకీరప్ప కొత్త మలుపు తిప్పేశారు. ఈ మలుపు తిప్పి మాధవ్ వీడియో కాల్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని ఆయన సంబరపడితే పడొచ్చు గాక.. కానీ ఆయన ఈ వ్యవహారంలో చూపిన అత్యుత్సాహం.. అధికార పార్టీనీ, ప్రభుత్వాన్నీ మరిన్ని చిక్కుల్లోకి నెట్టేసింది.  తన నగ్న వీడియో కాల్ బయటపడగానే ఎంపీ మాధవ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తానే ఎస్పీకి ఫిర్యాదు చేశానని స్పష్టం  చేశారు.

మరి ఫకీరప్ప అదే అనంతపురం ఎస్పీ.. ఆ ప్రెస్ మీట్ చూడలేదో.. లేక మరచిపోయారో కానీ.. అసలు ఎంపీ తమకు ఫిర్యాదే చేయలేదనీ, మాధవ్ అభిమాని తమకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఏపీలో పోలీసులు బాధితుల ఫిర్యాదులనే పట్టించుకోరు..అటువంటిది ఎంపీ తరఫున ఎవరో ఫిర్యాదు చేస్తే ఆఘమేఘాల మీద దర్యాప్తు చేసి వీడియో ఒరిజనల్ కాదు అని తేల్చేశారా అని సామాన్య జనులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంకా  అసలు వీడియో నిజమా? అబద్ధమా అని ఫొరెన్సిక్‌ నివేదిక రాకముందే, అది మార్ఫింగ్‌ కావచ్చంటూ ఎస్పీ ఎలా వ్యాఖ్యానించారని ప్రశ్నల బాణాలు సైతం సంధిస్తున్నారు.   ఆ వీడియో ఫేక్‌. ఒరిజినల్‌ కాదని కనుగొన్నాం. మార్ఫింగ్‌, ఎడిటింగ్ జరిగి ఉండవచ్చు. వీడియో ఒరిజినల్‌ అని నిర్థారించలేకపోతున్నాం. అసలు వీడియో దొరికేవరకూ ఏమీ చెప్పలేం. ఏం చేయలేం అని ఎస్పీ ఫకీరప్ప సెలవిచ్చారు. అక్కడితో ఊరుకోకుండా  ఎంపీ గోరంట్ల మాధవ్ మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇంక దీనిపై విచారణ ఏమిటన్నట్లు మాట్లాడారు.

అలాగే వీడియో ఒక వ్యక్తి చూస్తుండగా మూడో వ్యక్తి రికార్డు చేశారంటూ తన పరిశోధనను బయటపెట్టారు.  ఈ ప్రకటన చేసింది ఒక సాధారణ ఎస్సైయో,సీఐయో కాదు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఐపిఎస్‌.  నేను చెప్పేశాకా ఇక ఫొరెన్సిక్‌ నివేదికతో పనేముందన్నట్లు ఆయన చెప్పేశారు. ఎస్పీ ప్రెస్‌మీట్‌ ఇలా పూర్తయ్యిందో లేదో  ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అలా ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుని తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. ఇలా ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెట్టడం, ఆ వెంటనే ఎంపీ మీడియా ముందుకు రావడం కాకతాళీయం అని ఎవరూ భావించడం లేదు. అంతా ఒక పక్కా ప్రణాళిక మేరకు జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనితో ఎంపీ-ఎస్పీపై విపక్షాలు విమర్శలు గుప్పించారు.  వీడియో వ్యవహారంపై అన్ని యాంగిల్స్‌లో విచారణ జరిపిస్తామని హోంమంత్రి ప్రకటించిన తర్వాత.. విచారణలో దోషి అని తేలితే చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన తర్వాత .. ఎస్పీ ఫకీరప్ప ప్రెస్‌మీట్‌ పెట్టి, అది ఒరిజినల్‌ వీడియో కాకపోవచ్చని చెప్పడం బట్టి, కేసును  సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

మాధవ్ తాను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పిన తరువాత ఎస్పీ ఫకీరప్ప ఎంపీ ఫిర్యాదు చేయలేదనడం, హోంమంత్రి గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపించామని ప్రకటించిన తరువాత అటువంటిదేమీ జరగలేదని ఐపీఎస్ ఫకీరప్ప ఖండించడం ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. అన్నిటికీ మించి ఈ కేసులో ఫిర్యాదు చేసిందెవరన్న ప్రశ్నకు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎస్పీ ఫకీరప్పలు చెప్పాలి. ఇక హోంమంత్రి తానేటి వనిత ఎస్పీ ప్రెస్ మీట్ తరువాత ఏం మాట్లాడక పోవడాన్ని బట్టి ఆమెను ప్రభుత్వ ‘పెద్దలు’ బలవంతంగా సైలంట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసలు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎవరన్నది ప్రశ్న. తానే ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేశానని ఎంపీ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ తాజాగా ఎస్పీ మాత్రం, ఎంపీ గారి అభిమాని ఫిర్యాదు చేశారని సెలవిచ్చారు. అంటే పోలీసులు ఎంపీ ఫిర్యాదును తీసుకోలేదా? అసలు బాధితుడే ఎంపీ అయినప్పుడు, ఆయన తనపై కుట్ర జరిగిందని ఫిర్యాదు చేస్తే ఆయన ఫిర్యాదును తీసుకోకుండా, అసలు కేసుకు సంబంధం లేని అభిమాని ఫిర్యాదును ఎలా పరిగణనలోకి తీసుకుంటారన్నది ఘనత వహించిన ఎస్పీ ఫకీరప్పగారే చెప్పాలి. అలాగే ఎంపీ చెప్పినట్లు ప్రెస్‌కౌన్సిల్‌, సుప్రీంకోర్టులో పిల్‌, అన్ని వ్యవస్థలకూ కొంపతీసి అదే అభిమానే ఫిర్యాదు చేసినట్లు భావించాలా? మరి కోర్టులో బాధితుల తరఫున అభిమానులు వేసే పిల్‌ను అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఫకీరప్పగారే సమాధానం చెప్పాలి.  

ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో చెరపట్టి, అమరావతికి తెచ్చినప్పుడు ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సీఐడీ, దానిని ఫొరెన్సిక్‌ పరీక్షకు పంపింది. మరి ఇప్పుడు ఎంపీ మాధవ్‌ సెల్‌ఫోన్‌ నుంచి బ్లూ వీడియో వచ్చిందన్న ఆరోపణలున్నందున.. రఘరామరాజు విషయంలో అనుసరించినట్లుగానే, మాధవ్‌ ఫోన్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల  మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానినే ఫొరెన్సిక్‌కు పంపిస్తే నిజా నిజాలు బయటకొస్తాయి కదా?  అని నిలదీస్తున్నారు.

అసలు ఎంపీ మాధవ్‌ వీడియో వ్యవహారంపై విచారణ చేయాలని మహిళా హక్కుల కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీకి రాసిన లేఖపై విచారణ మొదలయిందా? లేదా? అన్నది ఇంతవరకూ తేలలేదు. ఎంపీ అభిమాని ఇచ్చిన ఫిర్యాదుతోనే సరిపెడతారా? లేక కమిషన్‌ చైర్మన్‌ లేఖపై ప్రత్యేకంగా విచారణ చేస్తారా? అసలు ఇప్పటివరకూ ఏపీ పోలీసు శాఖ గానీ, డీజీపీ గానీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.