తల్లి పోటు ..చెల్లి పోటును ఏమంటారు జగనన్నా ?

‘బాలయ్యా .. ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు. అక్కడ ఉన్నది ‘రీల్’ సింహం కాదు. జ‘గన్’ అనే  రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే’  ఇదొక ట్వీట్.  ఈ ట్వీట్’ చేసిన వారు, ఒక మహిళా మంత్రి ఆమె పేరు రోజా..  అలాగే మరో మహిళా మంత్రి కూడా ఇదే స్థాయిలో మరో ట్వీట్ చేశారు. నిజానికి, ఈ ఇద్దరు మంత్రులే కాదు,  జనం ఛీ.. కొడుతున్న ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు  వైసీపీ నాయకులు, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు, దిగజారుడు వ్యాఖ్యలు చాలానే చేస్తున్నారు. వైసీపీకి తోడు, ఆ పార్టీ రహస్య మిత్రులు బీజేపే నాయకులు కూడా వంత పాడుతున్నారు.

సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఅర్ కుటుంబంలో తెలుగు దేశం పార్టీలో చిచ్చుకు పెట్టే మరో కుట్రకు తెర తీస్తున్నారు.  చిత్రం ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, ఈ వంకర ట్వీట్లు చేసిన మహిళ మంత్రుల వరకూ ప్రతి ఒక్కరూ ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారో, చెప్పకుండా, తమ తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి లేదనే వితండ వాదాన్ని తెర మీదకు  తెస్తున్నారు.  ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేని గతాన్ని తీసుకొచ్చి, మోకాలుకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం నాయకులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ముక్త కంఠంతో ఒకటే ప్రశ్న అడుఉగుతున్నారు. ‘ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు?’ అని. అలాగే తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని  అంటున్నారు.    కానీ, జగన్ రెడ్డికి, ఆయనకు ప్లూటు ఊదుతున్న  మహిళా మంత్రులు, ఇతర నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగు దేశం పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభానికి, ‘వెన్నుపోటు’ అనే పేరు తగిల్చి, ఆ వంక తమ ప్రభుత్వం తీసుకున్న అరాచక రాజకీయ నిర్ణయాన్ని సమర్ధించుకునే  ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి అప్పుడేమి జరిగిందో, ఎందుకు తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడిందో, అందరికీ తెలిసిన విషయమే. ఆ నాడు, తెలుగుదేశంలో సంక్షోభానికి మూల కారణం, లక్ష్మీ పార్వతి. ఆమె దుష్ట సంకల్పంతో ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి పెట్టిన చిచ్చు కారణంగానే తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది.

ఆమె దుష్ట బుద్దితో ఎన్టీఆర్ ను మోసం చేసి వివాహం అనే ముసుగులో ఆయన జీవితంలో ప్రవేశించారు. భార్యగా నటించారు. అప్పుడే కాదు, ఇప్పడు కుడా ఆమె నైజం మారలేదు.నిజంగా ఆమె మనసా,వాచా,కర్మణ ఎన్టీఅర్ ను భర్తగా భావిచి ఉంటే, గౌరవించి ఉంటే, ఎన్టీఆర్ కు ఇంత అవమానం జరిగిన మరు క్షణం ఆమె తన పదవికి రాజీనామా చేయవలసింది. కానీ, ఇన్ని రోజులైనా, ఇంత చర్చ జరుగుతున్నా ఆమె మౌనంగా ఉన్నారు. ఎన్టీఆర్ ను అవమానించిన ప్రభుత్వం ఇచ్చిన పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆమె ఎన్టీఅర్ జీవితంలో ఎందుకు ప్రవేశించారో , ఏమి చేశారో, రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఎలా ప్రవర్తిచారో వేరే చెప్పనక్కరలేదు.

ఇంకా చిత్రం ఏమంటే, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో వుండి, అప్పట్లో వైసీపీని, జగన్ మోహన్ రెడ్డిని, చివరకు, చేతులు జాడించి జగన్ రెడ్డి, ‘ఆ దివంగత నేత, మహా  నాయకుడు’ అని గొప్పగా చెప్పుకునే వైఎస్సార్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన, ఈ మహిళా మణులే ఇప్పుడు చంద్రబాబు గురించి వెన్నుపోటు థియరీలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డిని   జ‘గన్’రీల్ సింహం కాదు, రియల్ సింహం’ అంటూ ఎత్తేస్తున్నారు. వారేవా, ఎంతటి జాణతనం, అని జనం విస్తు పోతున్నారు. 

అదొకటి అలా ఉంటే, ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను చిలువలు పలవలుగా చిత్రించి అసలు సమస్యను పక్క దారి పట్టించే జగన్ రెడ్డి,  తనను కష్ట కాలంలో, జైలులో ఉన్న సమయంలో, జగనన్న వదిలిన బాణం అంటూ, సుదీర్ఘ పాద యాత్ర చేసి పార్టీని బతికించిన సోదరి షర్మిలకు ఇచ్చిన కానుకను ఏమంటారు?

పార్టీని నిలబెట్టిన తన స్వంత తల్లీ, చెల్లిని పార్టీ నుంచి మెడ పట్టి బయటకు గెంటడాన్ని, ఏమంటారు? ఏ పోటంటారు? జగన్ రెడ్డి  అయన్ను భట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతున్న,మహిళా నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కానీ, వారు సమాధానం చెప్పరు. చెప్పలేరు, కానీ ప్రజలు మాత్రం సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తారు. నో డౌట్.