మహా సంక్షోభానికి పవార్ దూరం .. దేనికి సంకేతం?

మహారాష్ట్ర అధికార కూటమిలో తలెత్తిన సంక్షోభం, పూర్తిగా అది కూటమి అంతర్గత వ్యవహారం. నిజమే, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలతో ఏర్పడిన మహా వికాస్ అఘాడీ (ఎంవిఎస్)లో, కాంగ్రెస్, ఎన్సీపీలలో ప్రస్తుతానికి ఎలాంటి చిక్కులు, సమస్యలు లేవు. కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేనలో మాత్రమే, సంక్షోభావం తలెత్తింది. శివసేన ఎమేల్యేలే తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే నిర్వాకం వల్లనే సంక్షోభం తలెత్తింది.. అయినా, కూటమిలోని మూడు పార్టీలను కలిపి ముడి వేసింది మాత్రం, ఎన్సీపీ అధినేత్ శరద్ పవార్. నిజానికి, ఆయన రాజకీయ విజ్ఞత, వివేచన కారణంగానే, కూటమి ప్రభుత్వం ఇంత కాలం మనుగడ సాగించింది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, కూటమి సర్కార్, కర్త. కర్మ, క్రియ అన్నీ పవార్ అండ్ పవార్ ఓన్లీ. ఇందులో ఎవరికీ రెండవ అభిప్రాయం లేదు. 

అయితే, ఇప్పడు కూటమిలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడి ప్రభుత్వం పతనం అంచుకు చేరినా అదే  శరద్ పవార్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు? ఎందుకు, శిందే తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారమని చేతులు దులుపు కున్నారు?  అంతే కాదు, శివసేనలోని రెండు వర్గాల మధ్య దురాన్ని పెంచే విధంగా, పరోక్ష వ్యాఖ్యలు  ఎందుకు చేస్తున్నారు. గువహటిలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు 24 గంటల్లో  ముంబై తిరిగి వస్తే, అఘాడీ ప్రభుత్వం నుంచి వైదొలిగే (బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే) అంశాన్ని పరిశీలిస్తామని, శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ప్రకటనలో నిజం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ముంబై రప్పించుకునేందుకు వేసిన పాచిక అని పవార్ అర్ధ తాత్పర్యాలు విడమరించి చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? అంటే శివసేన రెండు వర్గాలు కలవడం పవర్ కు ఇష్టం లేదని చెప్పకనే చెప్పారని అనుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 

నిజానికి, మహా రాష్ట్ర రాజకీయాల్లో ఏది జరిగినా. అందులో ఏదో ఒక కోణంలో పవార్ పాత్ర ప్రమేయం లేకుండా ఉండదని, పవార్  ‘పవర్’ తెలిసిన ఎవరైనా అంగీకరిస్తారు. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుడుతుందేమో కానీ, మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ప్రమేయం లేకుండా, చీమ కుట్టదు, పావు కదలదు, అనేది రాష్ట్ర రాజకీయాలు తెలిసన అందరికీ తెలిసిన విషయమే. 

నిజానికి, గత రెండున్నర సంవత్సరాలలో కూటమిలో తలెత్తిన సమస్యలు అన్నింటినీ,  పార్టీలతో ప్రమేయం లేకుండా, పవారే సెటిల్ చేశారు. కానీ, ఈ విషయంలో మాత్రం కాలు కాదు కదా వేలు పెట్టేందుకు కూడా పవార్ సిద్దంగా లేరు. అయ్యేదేదో అసెంబ్లీలోనే అవుతుందని అంటున్నారే కానీ, జోక్యం మాత్రం చేసుకోవడం లేదు. దీంతో ఇప్పడు ఈ మరాఠ యోధుని యోచన ఏమిటి? అనే చర్చ జరుగుతోంది.అందుకు తగట్టుగానే, శివసేన తిరుగుబాటు నాయకుడు శిందేకు ఎన్సీపీ  ఫీలర్స్ పంపడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అదలా ఉంటే, పవార్ మౌనానికి ఇంకా కారణాలు ఉండవచ్చును కానీ, పరిస్థితి చేయిదాటి పోయిన నేపధ్యంలో వేలు పెడితే చేయి కాల్చుకోవడమే అవుతుందేమో, అనే అలోచనతోనే పవార్ నిశ్శబ్ద ప్రేక్షకుడు (సైలెంట్ స్పేక్టేటర్) పాత్రకు పరిమితం అయ్యారని  అంతర్గత వర్గాల సమచారంగా తెలుస్తోంది. అలాగే, శివసేన రెండు వర్గాల మధ్య, హిదుత్వ, బాలా సాహెబ్ భావజాలం. ఐడియాలజీ విషయంగా పీట ముడి బిగుసుకున్న నేపధ్యంలో ప్రస్తుత పరిస్థితులలో ‘ఆ వివాదంలో ఇరుక్కోవడం శ్రేయస్కరం కాదన్న ఆలోచనతోనూ, మరాఠా యోధుడు మౌనం ఆశ్రయించారని అంటున్నారు. అదలా ఉంటే, తాజాగా శివసేన నాయకుడు, సంజయ్ రౌత్ కేంద్ర మంత్రి ఒకరు, అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు శరద్  పవార్’ ప్రయత్నిస్తే ఆయన (పవార్) ఇంటికి వెళ్ళకుండా అడ్డుకుంటామని బెదిరించారని సంచలన వ్యాఖ్య చేశారు.

అయితే, ఇందులో నిజం ఉండే అవకాశమే లేదని అంటున్నారు. నిజానికి, పవార్ కు బెదిరుపులే వస్తే, పవార్  ఎందుకు పోలేసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ మంత్రి పేరును ఎందుకు  బయట పెట్టలేదు. పైగా, సంజయ్ రౌత్, ఈ బెదిరింపు పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తమ వైఖరి ప్రకటించాలని కోరారు. అంతేకానీ, పవార్ పై దాడి చేస్తామని బెదిరించి నట్లు ఆరోపిస్తున్న కేంద్ర మంత్రిపై, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గతంలో కేంద్ర మంత్రి నారాయణ రాణే ముఖ్యమత్రి ఉద్దవ థాక్రే’ను చెంప దెబ్బ కొట్టాలని అన్నందుకే మహా రాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆలాగే , పవార్ ను దూషిస్తూ, పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకే ఓ మరాఠీ నటిని పోలేసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరి ఇప్పడు ఏకంగా ఒక కేంద్ర మంత్రి పవర్ పై దాడి చేస్తామని బెదిరిస్తే , పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, పోలేసులు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అసలు ఆయన పేరును సైతం శివసేన రౌత్ ఎందుకు బయట పెట్టలేదు, అంటే అదొక కట్టు కథ, నిజం కాదు కనుకనే, సంజయ్ రౌత్ ఫేక్ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అవన్నీ ఎలా ఉన్నా,శరద్ పవార్ వ్యూహత్మకంగానే మౌన వహించారని, పరిశీలకులు అంటున్నారు. పవార్ సాబ్ .. ఏది ఉరికే చేయరు. ఆయన మాటకే కాదు మౌనానికి కూడా ఒక లేక్కుంటుంది ..అంటారు ఆయనేమిటో తెలిసిన సన్నిహితులు.