జూబ్లీ బైపోల్.. కమలం ఆటలో అరటిపండేనా?

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది.నవంబర్ 11న పోలింగ్ 14న కౌంటింగ్ జరుగుతుంది. మరోవంక, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. నిజానికి.. ఎన్నికల ప్రకటన కంటేముందు నుంచే జూబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల నుంచి ఆశావహులు, ఓ వంక టికెట్ కోసం ప్రయతిస్తూనే మరో వంక వ్యక్తిగత స్థాయిలో ప్రచారం సాగించారు.  

వాస్తవానికి.. జూబ్లీ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని,   కాంగ్రెస్, బీఆర్ఎస్ లతోపాటుగా బీజేపీ కూడా ప్రధాన పోటీ దారుగా ఉంటుందనీ, ముక్కోణపు పోటీ అనివార్యం అన్న ప్రచారం జరిగింది. అయితే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, బీజేపీ మరో మారు ఆటలో అరటిపండు అవుతుందా అనే అనుమనాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా.. అభ్యర్ధి ఎంపిక విషయంలో జాప్యం జరగడంతో పాటుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పోలిస్తే, పార్టీ నాయకత్వంలో ఉప ఎన్నికల గెలుపు విషయంలో  పెద్దగా ఆశలు,ఉత్సాహం కనిపించడం లేదు. అటు నాయకత్వంలోనూ, ఇటు క్యాడర్ లోనూ గెలుస్తామనే విశ్వాసం కనిపించడం లేదు. 

మరో వంక పార్టీ నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్  పార్టీలో పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ఎవరూ లేరన్నట్లుగా, బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన జీహెచ్ఎంసి మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ నుపార్టీలో చేర్చుకుని, జూబ్లీ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా నిలపాలని  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సూచించారు. సలహా ఇచ్చారు. అయితే  ఆయన ఏ ఉద్దేశంతో ఆ సూచన చేశారో ఏమో కానీ, ఆయన  చేసిన సూచన, పార్టీ బలహీనతను బయట పెట్టిందని అంటున్నారు. అరవింద్  సూచనతో అసలే అంతత మాత్రంగా ఉన్న క్యాడర్ ఉత్సాహం మరింతగా నీరుగారి పోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

అలాగే.. నియోజక వర్గంలో గట్టి బలమున్న టీడీపీ మద్దతు బేషరుతుగా లభిస్తుందని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే..  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భవిష్యత్ రాజకీయలను దృష్టిలో ఉంచుకుని  వ్యూహాత్మకంగా  మద్దతు విషయంలో బీజేపీ కోరితే ఆలోచిస్తామని  లేదంటే తటస్థంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నాయకులకు సూచించారు. దీంతో  మొదటి నుంచి మాగంటితో కలిసున్న టీడీపీ క్యాడర్ ,ఓటర్లు పార్టీతో సంబంధం లేకుండా మాగంటి సునీత వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. దీంతో  బీజేపీ క్యాడర్  మరింతగా నీరుగారి పోయిందని అంటున్నారు.  

అదలా ఉంటే..  మరో వంక నిరుత్సాహానికి గురైన బీజేపీ స్థానిక నాయకులు, క్యాడర్  పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, క్యాడర్ తో సహా బీఆర్ఎస్  తీర్ధం పుచ్చుకున్నారు.  మరో వంక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ మరో మారు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తనదైన స్టైల్లో’ సెటైర్లు వేశారు.  కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..?  బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా? కాంగ్రెస్‌ని గెలిపిస్తారా?  అంటూ  చురకలు అంటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.  మీ గౌరవం ప్రమాదంలో ఉంది అంటూ  కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యంగ వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ విసిరిన వ్యంగ్యాస్త్రాల విషయం ఎల్లా ఉన్నా..  జూబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ రోల్  ఏమిటి?  వ్యూహం ఏమిటి? అనే విషయంలో పార్టీ వర్గాలనుంచి వినిపిస్తున్న అనుమానాలు మాత్రం ఒటమి తథ్యం అనిపించేలాగానే ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu