ఢిల్లీలో చంద్రబాబు మోడీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?!

ప్రధాని మోడీ తనంత తానుగా చంద్రబాబు వద్దకు వచ్చి ఏం మాట్లాడారో ఇప్పుడు తెలిసిపోయింది. మోడీ తనతో ఏం మాట్లాడారన్నది స్వయంగా చంద్రబాబే చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగస్టు (9) మంగళవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావన వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు వెళ్లిన సంగతి విదితమే. ఆ సమావేశంలో ప్రధాని మోడీ చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించి ఒకింత పక్కకు తీసుకువెళ్లి ఓ ఐదు నిముషాలు ప్రత్యేకంగా ముచ్చటించిన సంగతి విదితమే. మోడీ, చంద్రబాబు మధ్య జరిగిన ఆ చిరు భేటీకే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినంత హడావుడి చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ వచ్చే ఎన్నికలలో బీజేపీ- తెలుగుదేశం పొత్తు కుదిర్చేసుకున్నాయని, అయినా సరే గెలుపు మాదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అసలింతకీ వారిద్దరి మధ్యా ఏం జరిగిందనేది పొలిట్ బ్యూరో సమావేశంలో ఒక సభ్యుడు అడిగినప్పుడు చంద్రబాబు చెప్పారు. సమావేశంలో తాను వేరే వారితో మాట్లాడుతుండగా మోడీ అటుగా వచ్చారనీ, తనను పలకరించి పక్కకు తీసుకువెళ్లి.. మనం కలిసి చాలా కాలమైంది.. ఇటీవల ఢిల్లీ రాలేదా అని అడిగారనీ చంద్రబాబు వివరించారు. దానికి తాను నాకు ఢిల్లీలో పనేముందని బదులిచ్చానన్నారు. అప్పుడు మోడీ అలా కాదు మీతో చాలా మాట్లాడాల్సి ఉంది. ఒక సారి వీలు చూసుకుని ఢిల్లీ రండి అని ఆహ్వానించారన్నారు. అలాగే వచ్చే ముందు పీఎంవోకు సమాచారమిస్తే అనువైన సమయం చెబుతాను అని మోడీ చెప్పారనీ తాను సరేనన్నానీ చంద్రబాబు వివరించారు.