ప్రభుత్వాన్ని నడపడం లేదు.. ఏదో మేనేజ్ చేస్తున్నామంతే!

కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తెలియజేసే ఓ ఆడియో లీక్ అయ్యింది. కర్నాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారానికి తెరతీశాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకోని అవకాశంగా అందివచ్చాయి.

అంతేనా ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసేలా వ్యాఖ్యలు చేసిన మధుస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ సహచర మంత్రులో ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ఎంత కప్పిపుచ్చుదామని చేసినా ముధుస్వామి వ్యాఖ్యలపై దుమరం రేగుతూనే ఉంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నపట్నకు చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్‌ మంత్రి మునుస్వామికి ఫోన్ చేసి రైతులకు సంబంధించిన అంశంపై కో-ఆపరేటివ్ బ్యాంకుపై  ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుపై మంత్రి సమాధానమిస్తూ  ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం  అని సమాధాపమిచ్చారు. అందుకు సంబంధించిన ఆడియో లీకై ప్రభుత్వాన్ని ఇక్కట్లలోకి నెట్టింది. దీనిపై మరో మంత్రి మునిరత్న మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం చేసే వ్యక్తులు కేబినెట్ లో ఉండాల్సిన అవసరం లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష కాంగ్రెస్ అయితే కర్నాటకలో బీజేపీ సర్కార్ ప్రజలకు కాకుండా ఆర్ఎస్ఎస్ కు జవాబుదారీగా ఉంటోందని విమర్శలు గుప్పించింది.