ఒక్కో నీటిబొట్టు వందేళ్ల జీవితం

రెండు ఇళ్ళు పక్కపక్కనే. ఒకటి పెద్ద మేడ, మరొకటి రెండు గదుల చిన్న ఇల్లు. ప్రతిరోజు రెండు ఇళ్లలో నీటి వాడకం మాములే, కానీ వాడే విధానం, వాడుతున్న పరిమాణం పోలిస్తే ఎంతో తేడా!! నీటిని కొంటున్నామనో, కరెంట్ బిల్ కడుతున్నామనో కారణాలు మరెన్నో కావచ్చు కానీ వ్యర్థం చేస్తున్న నీటిని తిరిగి ఉత్పత్తి చేయగలమా??

నీరు ప్రాణాధారమైనది. అన్ని జీవరాశులకు ఎంతో ముఖ్యమైనది. మనిషి జీవితంలో ప్రతి సందర్భంలో నీటి అవసరం ఎంతో ఉంటుంది. తినేటప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఇంటి పనుల కోసం ఇలాంటి వాటి నుండి, అందరికి అవసరమైన ఆహార ధాన్యాలు, పంటలు పండించడానికి, పెద్ద పెద్ద భవంతులు, నిర్మాణాలకు కూడా నీరు ఎంతో అవసరం.

ఒకప్పుడు……….

కొన్ని సంవత్సరాల కిందట గ్రామాలు, బావులు, చెరువులు ఇవన్నీ నీటితో, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక, నీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నవారు కిలో మీటర్ల కొద్దీ కాలి నడకన వెళ్లి బావులలో నీటిని తెచ్చుకునేవారు. వాటినే తాగడానికి నిత్యావసరాలకు కూడా ఉపయోగించుకునేవారు. బహుశా ఆ కాలంలో నీటిని తెచ్చుకోడానికి పడే ఇబ్బందుల పరిష్కారం వైపు ఆలోచన మరియు అభివృద్ధి వెంట పరుగులు పెట్టిన మేధస్సు అన్ని కలసి ఈరోజును సమస్యగా నిలిపిందేమో అనిపిస్తుంది.

ఎందుకలా??.....

పట్టణీకరణ పెరిగినకొద్ది ప్రకృతి తగ్గిపోతూ వస్తోంది అన్నమాట నిజం. ప్రతి ఇంట్లో ఎక్కడిక్కడ వాటర్ సప్లై, కష్టపడక్కర్లేకుండా కుళాయి తిప్పితే దూసుకువచ్చే జలధార. పది నిమిషాలు మోటార్ వేస్తే నీటి ట్యాంకులు నిండిపోతాయి. కిచెన్ లో కుళాయి ఆన్ లో పెట్టి అంట్లు తోముతూ ఉంటే ఎన్ని నీళ్లు డ్రైనేజీ పైపులలోకి వెళ్లిపోతున్నాయో!! బట్టలు ఉతికడానికి ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్. దానికి ఎన్ని నీళ్లు ఖర్చవుతున్నాయో!! పెద్ద పెద్ద ఇళ్ళు, పని మనుషులు, ప్రతి రోజు ఇల్లంతా తుడవడాలు, షవర్ స్నానాలు, నిత్య జీవితంలో మన శ్రమను తగ్గించే ఇలాంటివి ఎంత నీటిని వృధా చేస్తున్నాయో!! వేసవి వస్తే నీటి ఎద్దడి అనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో!! కాలంతో, ఋతువుతో సంబంధం లేకుండా నీటి కొరతతో కటకటలాడుతున్న ప్రాంతాలు ఎన్నో!! కానీ కొన్ని ఇళ్లకు ఎద్ద కష్టం అనిపించకుండా నీటి వసతి బాగానే ఉంటుంది. అలాంటి వారు మాకేం సమస్య లేదు అనుకుంటారు. కానీ ఆలోచించట్లేదు సుమా!! రేపటి తరానికి నీటి చుక్కను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెస్తున్నారేమో అనిపిస్తుంది.

ఏం చేయాలిప్పుడు??

చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఠక్కున వచ్చే సమాధానం. కుళాయి లో నుండి అని, అబ్బే అది కూడా కాదు లెండి టాప్ ఆన్ చేస్తే వస్తాయి అంటారు. అంటే వాళ్లకు నీళ్లు టాప్ లో వస్తాయని తెలుసు కానీ భూగర్భ జలాల గూర్చి తెలియదు. వర్షాలు పడినా నీటి కొరత ఏమిటో అర్థం కాదు. భూమిని మొత్తం సిమెంటు తో కప్పేసి, వర్షాన్ని భూమిలో ఇంకకుండా చేసి భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారకులం అవుతున్నాం. కానీ ఆ విషయాన్ని ససేమిరా ఒప్పుకొము. ఎందుకంటే మనుషులం మరి.  పుస్తకాలలో పాఠ్యాంశాలు, వాటి విశ్లేషణ కేవలం తరగతి గదులకు, నోటు పుస్తకాల్లో పేజీలకు పరిమితం అయిపోతుంటే పిల్లలకు ఎలా అర్థమవుతుంది మరి. బిజీ బిజీ బతుకుల్లో అవన్నీ చెప్పడం ఎలా కుదురుతుంది అనుకునేవాళ్ళు కొందరైతే, డబ్బు పోస్తున్నాం కాబట్టే వాడుకుంటున్నాం అని సమర్థించుకునేవాళ్ళు కూడా కొందరు. 


జనాభా పెరిగేకొద్దీ ఆవాస ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది. ఎన్నెన్నో వ్యవసాయ భూములు మేడలుగా మారిపోతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. మనిషి శరీరంలో 60 నుండి 70% నీరు ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. నీటి శాతం తగ్గిందంటే ఎన్నో అనారోగ్యాలు మొదలవుతాయి, ప్రాణానికి ప్రమాదం కూడా. మరి భూమి విషయంలో ఎవరైనా ఆలోచించారా?? కనీసం ఎప్పుడైనా ఈ విషయం బుర్రలో మెదిలిందా?? అయినా కూడా ఈ భూమి మనల్ని మోస్తూనే ఉంది. తన శక్తి మేర పంటల్ని ఇస్తూనే ఉంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?? భూమి సారం అవుతుందని, పంటలు బాగా పండుతాయని రసాయనాలు చల్లుతున్నాం. దానివల్ల ఇంకా చిక్కి శీల్యమయ్యి చివరకు బీడు భూమిగా మారిపోతోంది. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరగాలో అన్ని రకాలుగా జరిగిపోతోంది.

అందరి సహకారం ఇప్పుడే అవసరం.

ఇది నిజం సుమా!! నీరు, భూమి పరస్పర సంబంధం కలిగివున్న వనరులు. 

◆ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవలసిన అవసరం కొందరిది.

◆అడవులను నరికి వర్షపాత సాంద్రత తగ్గడానికి కారణం కాకుండా ఉండాల్సిన బాధ్యత మరి కొందరిది

◆వీలున్న ప్రతి  వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందేందుకు కృషి చేయవలసిన బాధ్యత కొందరిది.

◆చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత, మన దగ్గర ఉన్న నీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తించడం అందరి సమిష్టి బాధ్యత. అందుకే నీటి బొట్టు కోసం కాస్త ఆలోచన చేయండి. ఆలోచనతో ఆగిపోక ఆచరణలో ముందుకెళ్లండి. 

◆ వెంకటేష్ పువ్వాడ