వీఆర్వోలు రెవెన్యూ ఉద్యోగులే.. హైకోర్టు స్పష్టీకరణ

తెలంగాణ సర్కార్ కు హై కోర్టులో చుక్కెదురైంది. వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖలలో సర్దు బాటు చేస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆ జీవోను అమలు చేయవద్దంటూ నిలిపివేసింది.

 రాష్ట్రంలో వీఆర్వోలు ఇక ఎంత మాత్రం రెవెన్యూ శాఖలో ఉద్యోగులు కాదంటూ ప్రభుత్వం వారిని వేరు వేరు శాఖలకు సరెండర్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు వీఆర్వోలు ఆయా శాఖలలో విధులలో చేరిపోయారు.

అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. జీవోలోని కొన్ని అంశాలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇప్పటి వరకూ వేరే వేరే శాఖలలో విధులు స్వీకరించిన ఉద్యోగులంతా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతారని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.