సందర్శకులకు తలుపులు తెరిచిన సుప్రీం
posted on Jan 11, 2025 8:33AM
.webp)
దేశ సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు సందర్శకులకు తలుపులు తెరిచింది. సుప్రీం కోర్టు ఎలా ఉంటుంది. కేసుల విచారణ ఎలా జరుగుతుంది. అసలా కోర్టులో ఎన్ని బెంచ్ లు ఉన్నాయి. ఏ కేసులు ఏ కోర్టులో విచారణ చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి, సుప్రీం కోర్టును ఒక్కసారైనా చూడాలనీ, ఆ కోర్టులో వాదనలు జరిగే తీరు చూడాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. సుప్రీం కోర్టులో కొన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి ఇప్పటికే అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు సందర్శకులు ప్రత్యక్షంగా సుప్రీం కోర్టులో విచారణలు వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది.
ఇకపై ప్రభుత్వ సెలవులు, రెండో, నాలుగో ఆదివారాలు వినా.. ప్రతి శినవారం సందర్శకులకు సుప్రీం కోర్టు సందర్శనకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సందర్శకులను నాలుగు విడతలుగా, విడతకు 40 మంది చొప్పున సుప్రీం కోర్టు సందర్శనకు అనుమతిస్తారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు, 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు, 3.30 నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు విడతలుగా సందర్శకులను అనుమతిస్తారు.
ప్రతి బ్యాచ్ తోనూ ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ సుప్రీం కోర్టు గదులు, జ్యుడీషియల్ మ్యూజియం, న్యాయమూర్తుల గ్రంథాలయాలను చూపుతూ వాటి గురించి వివరాలు తెలియజేస్తారు. అయితే సందర్శకులు సుప్రీం కోర్టులో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మాత్రం అనుమతించరు. సెల్ ఫోన్ వినియోగాన్ని కూడా అనుమతించరు. సుప్రీం కోర్టు సందర్శించాలనుకునే వారు ముందుగా ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. వారికి కేటాయించిన స్లాట్ టైమ్ కంటే కనీసం అరగంట ముందు సుప్రీం కోర్టు వద్దకు చేరుకోవాలి.