ఉక్కు ఉద్య‌మం @ 250 డేస్‌.. స‌డ‌ల‌ని ఉక్కు సంక‌ల్పం..

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హ‌క్కు అంటూ కార్మికులు నిన‌దిస్తూనే ఉన్నారు.  వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. రోజుల త‌ర‌బ‌డి దీక్ష‌లు, ధ‌ర్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా, ప్ర‌భుత్వాలు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఉక్కు ప‌రిశ్ర‌మ అమ్మ‌కం ప‌నులు వేగ‌వంతం చేస్తూనే ఉంది. పైపైకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు న‌టిస్తూ.. వైసీపీ స‌ర్కారు విశాఖ ఉక్కు విష‌యంలో డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌ని విప‌క్షం మండిప‌డుతోంది. ఇలా రోజులు గ‌డుస్తున్నాయే కానీ, కార్మికుల ఆక్రోశం కేంద్రం చెవికి సోక‌డం లేదు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు 25 గంటలు నిరవధిక దీక్ష చేపట్టాయి. 250మందికి పైగా కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. 

నవంబర్‌ 1వ తేదీ విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామని వెల్లడించారు. ఉక్కు సంక‌ల్పంతో పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్టు కార్మిక సంఘాలు తెలిపాయి.