చెత్త రికార్డులో టాప్ 10లోకి కోహ్లీ.. స‌రిలేరు నీకెవ్వ‌రు..!!

విరాట్ కోహ్లీ. ఈ పేరు విన‌గానే.. సూప‌ర్ బ్యాట్స్‌మేన్‌.. డాషింగ్ బ్యాట్స్‌మెన్‌.. టెరిఫిక్ కెప్టెన్‌.. అగ్రెసివ్ యాటిట్యూడ్‌.. ఖ‌త‌ర్నాక్ ఫీల్డ‌ర్‌.. ఇలాంటి స్టేట్‌మెంట్సే గుర్తుకు వ‌స్తాయి. కానీ, ఈ ప‌రుగుల యంత్రం ఖాతాలో తాజాగా ఓ ప‌ర‌మ చెత్త‌ రికార్డు జ‌మ అయింది. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 5 బాల్స్‌ ఆడిన కోహ్లీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగులో కవర్ ఫీల్డర్ తెంబా బవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు.

వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి. ఇక, స్పిన్నర్‌కు దొరికిపోవడం ఇదే తొలిసారి. ఈ అవుట్‌తో కోహ్లీ వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌లను అధిగమించాడు.

వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ ఇప్ప‌టికీ టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడు. టెండూల్కర్ వన్డేల్లో 20 సార్లు పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో జవగళ్ శ్రీనాథ్ (19), అనిల్ కుంబ్లే (18), యువరాజ్ సింగ్ (18), హర్భజన్ సింగ్ (17), సౌరవ్ గంగూలీ (16), జహీర్ ఖాన్ (14), కోహ్లీ (14), సురేశ్ రైనా (14), వీరేంద్ర సెహ్వాగ్ (14), రాహుల్ ద్రవిడ్ (13), కపిల్ దేవ్ (13) ఉన్నారు. 

ఇక‌, వరుసగా 64వ ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ సెంచరీ చేయ‌కుండానే అవుట‌య్యాడు. ఈ 64 ఇన్నింగ్స్‌లలో కోహ్లీకి ఇది ఏడో డకౌట్.