దేశమంతా మెచ్చుకోవడం షర్మిలకు కనిపించలేదా?

వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ కౌంటర్ అటాక్ చేశారు. రైతు బీమా విషయంలో ఆమె అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే అభాసుపాలవుతారని, అందుకే తెలుసుకొని మాట్లడితే గౌరవం మిగులుతుందంటూ హితవు పలికారు. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభు రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ. ని ఒప్పించి కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారని, దాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. ఎల్ఐసీ జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని వివరణ ఇచ్చారు. దేశమంతటా ఎల్ఐసీ ఒకే విధానాన్ని అమలు చేస్తుందని, ఆ ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్నవారికే రైతుబీమా కూడా వర్తిస్తుందని, ఈ విషయం షర్మిలకు తెలియదా అంటూ సవాల్ చేశారు.

రైతుబీమా పథకాలకు రైతు అయితే సరిపోదా.... వయసుతో ఏం పని.. అంటూ షర్మిల కేసీఆర్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. తనకు నచ్చిన అధికారులకు 65 ఏళ్ల వయసొచ్చినా పోస్టులు కేటాయిస్తూ జీతాలు ఇస్తున్న కేసీఆర్... రైతులకు మాత్రం వయో పరిమితి ఎందుకు విధిస్తున్నారో చెప్పాలన్నారు. రైతు బీమా పొందడానికి రైతు అయి ఉంటే సరిపోదా.. వయసుతో ఏం పని అంటూ పదునైన వ్యాఖ్యలు చేయడంతో వినోద్ కుమార్ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.