మేయర్ మంట.. తమ్ముళ్ల తన్నులాట..

"నానిని ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని". "ఏ గొట్టం గాడు మాకు అధిష్టానం కాదు". "టీడీపీని  కుల సంఘంగా మార్చుతున్నాడు, పార్టీ ఎవరి జాగీరు కాదు". కేశినేని నానికి బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాల వార్నింగ్.  నాని కావాలా? మేమంతా కావాలా? చంద్రబాబుకు బెజవాడ తమ్ముళ్ల అల్టిమేటం. 

విజయవాడ టీడీపీలో అంతర్ఘత కుమ్ములాట. పార్టీ లైన్ తప్పి తెలుగు తమ్ముళ్ల తన్నులాట. కేశినేని నాని ఒకవైపు.. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాలు మరోవైపు. కేశినేని కూతురు శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మిగతా వారంతా గుర్రుగా ఉన్నారు. అంతాకలిసి బొండా ఉమా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని.. కేశినేనిపై కస్సుమన్నారు. తమ పార్టీ నేతనే నోటికొచ్చినట్టు  చెడామడా తిట్టేశారు. టీడీపీలో ఈ స్థాయిలో వర్గ విభేదాలు గతంలో ఎన్నడూ చూడలేదు. ఆధిపత్య పోరు కాస్తా, కులాల కుమ్ములాటలుగా మారాయి. విజయవాడ టీడీపీలో కమ్మ వర్సెస్ కాపు రాజకీయం నడుస్తోంది. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతుంటున్నావంటూ నానిపై చిందులు తొక్కారు అసంతృప్త నేతలు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కేశినేనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు.

గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం నాని అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానంటూ బుద్దా వెంకన్న సంచలన కామెంట్లు చేశారు. ‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. తన అనుచరుడుని పంపితే కేశినేని కాళ్లు విరగ్గొడతాడంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ నానిపై మండిపడ్డారు. 

బొండా ఉమా సైతం కేశినేనిపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. పనిలో పనిగా అధినేత చంద్రబాబుకు సైతం అల్టిమేటం ఇచ్చారు. కేశినేని కావాలా? అందరూ కావాలా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం.. కులాల మధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వర్గాలను, విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే.. రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే.. కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. ఆదివారం జరిగే చంద్రబాబు టూర్ రూట్ మ్యాప్ ను కేశినేని మార్చేశారని.. ఇలా అయితే చంద్రబాబు పర్యటనకు తామంతా దూరంగా ఉంటామని హెచ్చరించారు బెజవాడ తమ్ముళ్లు.

సొంత పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదన్నారు. తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసినవారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయొచ్చని చెప్పారు. విభేదాలు ఉన్నాయని వారుంటున్నారని, లేవని తానంటున్నానన్నారు. విమర్శలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు నాని.

అటు.. బెజవాడ తెలుగు తమ్ముళ్ల విభేదాలు అధినేత చంద్రబాబు దృస్టికి చేరాయి. వెంటనే టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు.. అసంతృప్త నేతలను సముదాయించారు. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.