విజయవాడ దుర్గగుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం
posted on Oct 12, 2025 12:44PM

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రాజగోపురం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలనుండి కార్యక్రమం ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనా నాయక్ 16 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, 1 ఎక్స్ అఫీషియో మెంబెర్, 2 ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇద్దరు సభ్యులు చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ గాంధీ ని చైర్మన్ గా ప్రతిపాదించగా,మిగతా సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దాంతో బొర్రా రాధాకృష్ణ చైర్మన్ గా ఎన్నికయినట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.
అనంతరం ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. చైర్మన్,సభ్యులు దుర్గా మల్లేశ్వరులకు, ప్రభుత్వమునకు ధన్యవాదములు తెలియజేసారు. అనంతరం ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో నూతన చైర్మన్, సభ్యులను ఆలయంలోనికి తోడ్కోని వెళ్లి అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం అందించారు.అనంతరం మహా మంటపం 6వ అంతస్తులో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే. శీనా నాయక్ వార్లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
రాజధానిలో ఉన్న ప్రాముఖ్య ఆలయమైన కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, మాస్టర్ ప్లాన్ అమలుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, దసరా లో ఈవో సారద్యం లో పని చేసి ఉత్సవాలు విజయవంతం చేసిన రీతిలో సిబ్బంది అంతా అదే స్ఫూర్తి కొనసాగించాలని, ధర్మకర్తల మండలి మొత్తం సిబ్బంది, ఈవో గారితో కలసి మెలసి ఒకే కుటుంబంగా ముందుకు సాగుతామని బొర్రా రాధాకృష్ణ గాంధీ పేర్కొన్నారు.
దేవస్థానం ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మ కర్తల మండలి సహకారంతో ముందుకు సాగుతామని,భక్తులకు సరైన సౌకర్యాల కల్పన కు కృషి చేస్తామని పేర్కొన్నారు. కొండ దిగువున నూతనంగా సమాచారకేంద్రాల ఏర్పాటు, భక్తుల కోసం కొత్త బ్యాటరీ వాహనాల ఏర్పాటు చేస్తున్నామని ఈవో వివరించారు. భక్తి, ఆధ్యాత్మిక భావన ఉన్న ధర్మకర్తల మండలితో సంయుక్తంగా ముందుకు సాగుతామని తెలిపారు.
నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ, సభ్యులను రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, స్థానిక శాసన సభ్యులు సుజనా చౌదరి,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొని, అభినందనలు తెలియజేసారు.