విజయసాయి పీఏ.. పైసా వ‌సూల్‌.. పోలీసులే ప‌రేషాన్‌..

విజ‌యసాయిరెడ్డి. జ‌గ‌న్‌రెడ్డి కేసుల్లో ఏ2నే కాదు వైసీపీలో నెం-2 కూడా. ఉత్త‌రాంధ్ర‌కు సామంత రాజు. ఆ మూడు జిల్లాల్లో ఆయ‌నదే రాజ్యం. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా విజ‌య‌సాయి క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంది. రియ‌ల్ ఎస్టేట్ దందాలు, అక్ర‌మాలు పెద్దఎత్తున చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌. మ‌రి, అంత ప‌వ‌ర్‌ఫుల్ అయిన విజ‌య‌సాయిరెడ్డికి పీఏ అంటే.. ఎంతోకొంత ఆయ‌న‌కూ ప‌వ‌ర్ ఉంటుందిగా. స‌రిగ్గా ఇదే పాయింట్ మీద భారీగా మోస‌పోయారు ఓ వైసీపీ నేత‌. ఆ డీటైల్స్ య‌మ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

అది విశాఖలోని విజ‌య‌సాయిరెడ్డి ఆఫీస్‌. సార్‌ని క‌లుద్దామ‌ని గుంటూరుకు చెందిన వైసీపీ నేత నాగం వెంక‌ట‌మోహ‌న్ వెళ్లాడు. సార్ బిజీగా ఉన్నారు. ఆ ఆఫీసులో ఓ వ్య‌క్తి తెగ హ‌డావుడి చేస్తున్నాడు. ఎవ‌రా అని ప‌రిచ‌యం చేసుకుంటే.. తాను విజ‌య‌సాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబున‌ని చెప్పాడు. ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్రోగ్రామ‌ర్‌గా కార్య‌క‌లాపాలు ప‌ర్య‌వేక్షిస్తుంటాన‌ని చెప్పాడు. ఎందుకైనా మంచిద‌ని.. ఏదైనా ప‌ని ఉంటుంద‌ని.. పీఏ నాగేంద్ర‌బాబు ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడు గుంటూరు వైసీపీ నేత మోహ‌న్‌. 

క‌ట్ చేస్తే, వ‌న్‌ఫైన్ డే పీఏ నాగేంద్ర‌బాబు నుంచి వెంక‌ట‌మోహ‌న్‌కు ఫోన్ వ‌చ్చింది. ‘బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఇప్పిస్తా.. తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి’ అని నాగేంద్రబాబు.. మోహ‌న్‌కు ఆశ క‌ల్పించాడు. త‌న‌కు తెలిసిన ఓ ఇద్ద‌రికి జాబ్స్ కావాలంటూ.. మోహ‌న్‌.. విజ‌యసాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబును అడిగాడు. అత‌ను స‌రేన‌ని.. 2 ల‌క్ష‌ల‌కు డీల్ కుదుర్చుకున్నారు. ఆ మొత్తం చెల్లించేశారు.  

విజ‌య‌సాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబుకు డ‌బ్బులిచ్చినా.. రోజులు గ‌డుస్తున్నాయే కానీ, జాబ్ అపాయింట్‌మెంట్ మాత్రం ఇవ్వ‌ట్లేదు. నాగేంద్ర‌కు త‌రుచూ ఫోన్ చేస్తున్నాడు మోహ‌న్‌. మీ ప‌ని మీదే ఉన్నా.. విజ‌యసాయిరెడ్డి సార్‌తో మాట్లాడా.. క‌లెక్ట‌ర్‌తో మాట్లాడుతున్నా.. త్వ‌ర‌లోనే ప‌ని అయిపోతుందంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కాల‌యాప‌న చేస్తున్నాడే కానీ.. ఉద్యోగం మాత్రం రావ‌ట్లేదు. మొద‌ట్లో ఇలా ఏదో ఒక ఆన్స‌ర్ చెప్పేవాడు. ఆ త‌ర్వాత ఫోన్ లిఫ్ట్ చేయ‌డం మానేశాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ మాట్లాడ‌క‌పోవ‌డంతో.. డౌట్ వ‌చ్చిన గుంటూరు వైసీపీ నేత మోహ‌న్‌.. విశాఖ‌లోని విజ‌యసాయిరెడ్డి ఆఫీసుకు మ‌రోసారి వెళ్లాడు. అక్క‌డ విజ‌య‌సాయి పీఏ నాగేంద్ర‌బాబు క‌నిపించ‌లేదు. ఆయ‌న కోసం ఆరా తీస్తే.. అస‌లు అక్క‌డ నాగేంద్ర‌బాబు పేరుతో ఎవ‌రూ లేర‌ని తెలిసింది. దీంతో.. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించాడు ఆ వైసీపీ నేత‌. 

మోహ‌న్ విశాఖ విజ‌య‌సాయి ఆఫీసులో త‌న‌కోసం ఎంక్వైరీ చేసిన విష‌యం నాగేంద్ర‌బాబుకు తెలిసింది. దీంతో.. నాగేంద్ర‌నే మోహ‌న్‌కు ఫోన్ చేసి.. ‘నా గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. నీ నుంచి తీసుకున్నది లక్షే. కొంచెం టైమ్‌ ఇస్తే ఆ మొత్తం ఇచ్చేస్తా. నా గురించి విచారించినా, ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటా’ అని బెదిరించాడు. 

ఇదేదో తేడాగా ఉంద‌ని అల‌ర్ట్ అయిన వైసీపీ నేత వెంక‌ట‌మోహ‌న్.. స్పందన కార్యక్రమంలో గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. నాగేంద్రబాబు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాలకు ప్రొఫైల్‌ పిక్‌గా పోలీసు యూనిఫాంలతో ఉన్న ఫొటోలు ఉండ‌టం కొస‌మెరుపు. ఆ పిక్స్ చూసి ఖాకీలే అవాక్క‌వుతున్నారు.