రేపే వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. కరువు సీమకు కృష్ణమ్మ జలసిరులు..!
Published on: Sun Aug 30, 2026 1:07PM

3 దశాబ్దాల కలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు..!
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు, లక్షలాది మంది ప్రజల కన్నీళ్లకు నేటితో తిరోధ్యానం లభించబోతోంది. తీవ్ర కరువుతో, ఫ్లోరైడ్ నీటి సమస్యతో దశాబ్దాలుగా నరకం చూసిన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు కడప జిల్లాల మెట్ట ప్రాంతాలకు తీపి కబురు అందింది. పూల సుబ్బయ్య వెలిగొండ ఎత్తిపోతల ప్రాజెక్ట్ మొదటి విడత పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న మార్కాపురంలో ఘనంగా ప్రారంభించనున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి నల్లమల కొండలను తొలిచి నిర్మించిన జంట సొరంగాల గుండా కృష్ణమ్మ జలాలు స్వయంప్రతిపత్తితో గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్‌కు చేరుకోనున్నాయి. సరిగ్గా 1996 మార్చి 5న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయగా, దాదాపు 30 సంవత్సరాల తరువాత మళ్లీ ఆయన చేతుల మీదుగానే ఇది ప్రారంభం కావడం ఒక చారిత్రాత్మక ఘట్టం.
ఈ బృహత్తర ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ. 10,200 కోట్లు కాగా, ప్రకాశం, నెల్లూరు కడప జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీరు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. తొలి దశ ప్రారంభంతో నల్లమల సాగర్‌లో 10.70 టీఎంసీల నీటిని నిల్వ చేసి, 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు మరియ మార్కాపురం పరిసర ప్రాంతాలలోని 4 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు.
ఇక రెండవ దశ పూర్తయితే మరో 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, మొత్తం 23 లక్షల మందికి ఫ్లోరైడ్ రహిత సురక్షిత మంచి నీరు లభించనుంది. అంతేకాకుండా డోనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 2.58 టీఎంసీలు, పామూరు పెదచర్లోపల్లెలోని జాతీయ పెట్టుబడుల తయారీ మండలికి (NIMZ) 1.27 టీఎంసీల నీటిని కేటాయించడం ద్వారా ఈ ప్రాంత పరిశ్రమలకు మరియు ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.
నల్లమల కొండల్లో 18.8 కిలోమీటర్ల పొడవైన జంట సొరంగాలు తవ్వడం మరియు 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువను పూర్తి చేయడం భారతీయ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్ట్ కోసం ఇళ్లను, భూములను త్యాగం చేసిన 11 ముంపు గ్రామాల బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 6,206 కుటుంబాలకు రూ. 768 కోట్లకు పైగా పరిహారం పంపిణీ చేసింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడుల ప్రణాళిక సిద్ధమవుతున్న వేళ, వెలిగొండ జలాలు రాయలసీమ మరియు ప్రకాశం సరిహద్దు ప్రాంతాలలో పసిడి పంటలకు కొత్త ఊపిరి పోయనున్నాయి. తరతరాల కరువు పీడ వదిలి, పచ్చని పైర్లతో మెట్ట సీమ కలకలలాడబోతోంది.
Veligonda Project, Chandrababu Naidu, Nallamala Sagar, Prakasam District Irrigation, Krishna Water Markapur, Veligonda Inauguration Details


