కడప బిడ్డను విస్మరించిన కడప బిడ్డ

పాత సమస్యలు దారి మళ్లించేందుకు రోజుకో కొత్త ఇష్యూ చొప్పున క్రియేట్ చేస్తున్న ఆంధ్రా సీఎం జగన్... తాజాగా మరో వివాదానికి కారణమయ్యారు. కొత్త జిల్లాల పేరుతో ప్రజల్ని కాస్తో కూస్తో ఊరడిద్దాం అనుకుంటున్న జగన్ కు ఊహించని కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీకి  అద్భుతమైన పేరు-ప్రఖ్యాతులు రావడంలో, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటడంలో, అనేక సాంఘిక దురాచారాలను, కులాల కుత్సితపు కట్టుబాట్లను, అగ్రవర్ణ దురహంకారాన్ని తీవ్రంగా ఎండగట్టిన వీరబ్రహ్మేంద్రస్వామికి కొత్త జిల్లాల్లో చోటే దక్కకపోవడంపై ఆంధ్రా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు, ఆచరణల్లో ఎంతో పారదర్శకత, ఎంతో సామాజిక శ్రేయోకాంక్ష మాత్రమే గాక సర్వమానవాళికి వినిపించిన ఆయన కాలజ్ఞానం తెలుగుప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామిని ఈ ప్రపంచం మరచిపోకుండా అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. దానికి టైటిల్ కూడా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర అంటూ ఆయన పట్ల ఎంతో భక్తిభావం చాటుకున్నారు. తెలుగునేలపై నడిచిన దైవంగా అన్నగారి అభిమానులు ఎన్టీఆర్ ను కీర్తిస్తున్నట్టే... వీరబ్రహ్మేంద్రస్వామిని సైతం తెలుగుప్రజలు అలాగే భావిస్తారు. 

అలాంటి ఎన్టీఆర్.. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధకుడిగా మారిపోయి ఎంతో నియమ నిష్టలతో స్వామివారి చరిత్రను నభూతో, నభవిష్యత్ అన్న రీతిలో తెరక్కించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను ఒంటిపూట భోజనం చేశానని, యోగాభ్యాసం చేశాననని, చాప మీదే శయనించి బ్రహ్మచర్యం పాటించానని, ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ తనను ఆ వీరబ్రహ్మేంద్రస్వామి ఆవహించినట్టుగానే ఉండేదని, ఏదో అద్భుత శక్తి తనను నడిపిస్తున్నట్టు, తనతో మాట్లాడిస్తున్నట్టు అనిపించేదని పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకొని ఎంతో  ఉప్పొంగిపోయారు. ఆ సినిమాను తన జీవిత లక్ష్యంగా కూడా చెప్పుకున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో గతంలో పలువురు సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పుడు వారికి అనుకోని సంఘటనలు ఎదురయ్యాయని, అనేక అవాంతరాలు కలిగాయని, సినిమా కోసం ముందుకొచ్చి వారెంతో నష్టపోయారంటూ తన శ్రేయోభిలాషులు హెచ్చరించారని చెప్పుకున్నారు. అయినా తానెంతో నిష్టగా ఆ సినిమాను చేయడం వల్ల సాక్షాత్తూ ఆ వీరబ్రహ్మేంద్రస్వామే అన్నీ ముందుండి చూసుకున్నాడని, అందువల్లే ఆ సినిమా హిట్టయ్యి తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిందని చెప్పుకొని మురిసిపోయారు. ఇదంతా వీరబ్రహ్మేంద్రస్వామి పట్ల ఎన్టీఆర్ కు ఉండే భక్తిప్రపత్తులకు తార్కాణంగా చెప్పుకోవాలి. 

మరోవైపు ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్రజల అభిప్రాయాలు, సూచనలు కూడా వినేందుకంటూ నోటిఫికేషన్ వెలువరించారు. అయితే ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటును టీడీపీ శ్రేణులు, పలువురు ప్రముఖులు స్వాగతిస్తుండగా రాజకీయ నిపుణులు మాత్రం అందులోని జగన్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు మంచిదే కానీ.. ఆయన దైవంగా భావించిన వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడాన్ని ఎలా సమర్థించుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఓట్ల రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో పలు ముఖ్యమైన సామాజికవర్గ సమీకరణల్ని దెబ్బ తీయడం కోసమే చేస్తున్నారు తప్ప.. చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. నిజంగా జగన్ కు చారిత్రక పురుషులపై అంతగా అభిమానం ఉంటే వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించేవాడే కాదంటున్నారు. ఆంధ్రాతో ఏ సంబంధం లేని తెలంగాణ కవి, గాయకుడు గోరటి వెంకన్న రాయలసీమ గొప్పతనాన్ని, అక్కడి చారిత్రక ఔన్నత్యాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. శ్రీరాములయ్య సినిమాలో... నను గన్న నా తల్లి రాయలసీమ, రతనానల సీమ అంటూ ఆ పాటలో వెంకన్న ఎంతో ఉద్వేగాన్ని మేళవించారు. రాయలసీమ కవిపుంగవులు కూడా ఇంత బాగా రాయలేరేమోనన్న అద్భుతమైన కితాబును వెంకన్న అందుకున్నారు. 

మరి రాయలసీమకు అందులోనూ బ్రహ్మంగారి మఠం వెలసిన కడప జిల్లాకు చెందిన జగన్.. వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడం ఏంటని ప్రజలంతా విస్తుపోతున్నారు. సామాజిక సంస్కరణ కోసం కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయిన వీరబ్రహ్మేంద్రస్వామి.. ఆనాడే కొందరు అగ్రకులస్తుల దురహంకారాన్ని భరించారు. వారిని తన మాటల ద్వారా, పాటల ద్వారా, బోధనల ద్వారా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయినా నిజాలు గ్రహించలేని సందర్భాల్లో వారి కళ్లు తెరిపించడానికి అనేక మహిమలు కూడా చూపారు. తన మహిమల ద్వారా నవాబులను సైతం శిష్యులుగా చేసుకున్నారు. తన అకుంఠిత దీక్షతో, దైవీచింతనతో పెద్దసంఖ్యలో శిష్యగణాన్ని పెంపొందించుకున్నారు. కులాతీత, మతాతీత సహజీవనం కోసం ఎంతో శ్రమించారు. జీవసమాధి నిష్ట వహించేవరకు ఇదే ఓ వ్రతంగా కొనగించారు. 

అంతటి మహిమాన్వితుడు, తపస్సంపన్నుడూ అయిన వీరబ్రహ్మేంద్రస్వామి ప్రస్తావనే లేకుండా చేయడంలో జగన్ ఆంతర్యమేంటని, ఇది కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకమా తెలియజేయాలని, ఒకవేళ పొరపాటున వీరబ్రహ్మేంద్రస్వామి పేరు గనక మిస్సయితే వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వచ్చే ఉగాది లోగా జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

- టి.రమేశ్ బాబు