వ్యాక్సిన్ వ‌ర్రీస్‌.. ఎవ‌రికి టీకా వ‌ద్దంటే...

దేశ‌మంతా వ్యాక్సిన్ ఉత్స‌వం న‌డుస్తోంది. అర్హ‌త ఉన్న‌వారంతా టీకాల కోసం ఎగ‌బ‌డుతున్నారు. అయితే, అదే స్థాయిలో వామ్మో వ్యాక్సిన్ మాకొద్దు అనే వారూ ఉన్నారు. చాలా మందిని వ్యాక్సిన్ భ‌యం వేధిస్తోంది. టీకా తీసుకోవాలా వ‌ద్దా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?  చిన్న పిల్ల‌ల‌కు కూడా టీకాలు వేయించాలా?  వేరే రోగం ఉంటే ఎలా? ఇలా అనేక డౌట్స్‌. అందుకే, ఎందుకైనా మంచిద‌ని టీకాల‌కు దూరంగా ఉంటున్న‌వారూ ఎక్కువ మందే ఉన్నారు. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు తొల‌గించేందుకు, ఎవ‌రెవ‌రికి వ్యాక్సిన్ స‌రికాదో తెలుపుతూ కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.  

జ్వరంగా ఉన్నప్పుడు కరోనా టీకా వ‌ద్దు. జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి. అలర్జీ ఉన్నా.. అది తగ్గిన తర్వాతనే టీకా. బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలి. 

ఇప్ప‌టికే క‌రోనా సోకి.. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.  అలాగే, ఏ వ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సహజం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలి.  మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదని కేంద్ర‌ మార్గదర్శకాల్లో తెలిపారు.  

వ్యాక్సిన్లు వచ్చాయి కదా అని తొందర పడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.