ఏపీలో వ్యాక్సినేష‌న్ బంద్‌!.. ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్న‌ట్టు?

కావ‌ల‌సిన‌న్ని వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో లేవు. ప్ర‌భుత్వ స‌న్నాహాలు స‌రిగ్గా లేవు. అందుకే, ఏపీలో ప‌లు జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్ర‌హ‌స‌నంగా మారుతోంది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎక్క‌డిక‌క్క‌డ వ్యాక్సినేష‌న్‌ను నిలిపి వేస్తున్నారు అధికారులు. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి హామీ లేక‌పోవ‌డం.. టీకాలు నిండుకోవ‌డంతో.. ఉన్న‌ట్టుండి హ‌ఠాత్తుగా వ్యాక్సినేష‌న్‌ను ఆపేస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు. ముఖ్య‌మంత్రి స్థాయిలో వ్యాక్సిన్ నిల్వ‌ల‌పై స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల సోమ‌వారం, మరికొన్నిచోట్ల సోమ‌, మంగ‌ళ‌వారాల్లో కూడా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.  చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారి జాబితా తయారు చేస్తుండగా.. జిల్లాలో రెండ్రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. టీకా కార్యక్రమం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సెకండ్‌ డోస్‌ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు.   

కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లాలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండో డోసు కోసం గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.  జిల్లా అంతా టీకా వేస్తున్నా గన్నవరంలో వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్‌, ఎమ్మెల్యేకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో టీకా వేయలేమని అధికారులు చెబుతుండంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.  

విజయనగరం జిల్లాలోనూ సోమ‌వారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. మంగ‌ళ‌వారం నుంచి యథావిధిగా వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. మరోపు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ టీకా పంపిణీ నిలిచిపోయింది.  

ఇలా, ఏపీ వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం అర్థాత‌రంగా ఆగిపోతోంది. టీకాల కొర‌తే ఇందుకు కార‌ణ‌మని తెలుస్తోంది. కేంద్రం నుంచి స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డం.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌రైన ప్ర‌య‌త్నాలు లేక‌పోవ‌డం.. ప్ర‌స్తుత ఆటంకానికి కార‌ణం అంటున్నారు. ఏపీలో క‌రోనా భారీగా విజృంభిస్తున్న వేళ‌.. ఇంత‌టి ప్రాధాన్య‌మైన టీకా కార్య‌క్ర‌మం ప్ర‌హ‌స‌నంగా సాగుతుండ‌టం సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేత‌గాని త‌న‌మేన‌ని విమ‌ర్శిస్తోంది విప‌క్షం.