సీతక్కకు ఉత్తమ్ హ్యాండ్.. రేవంత్‌రెడ్డి వల్లేనా?

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య కో్ల్డ్ వార్! ఆధిపత్య పోరులో ప్రస్తుతం రేవంత్ రెడ్డిదే అప్పర్ హ్యాండ్. ఉత్తమ్ ఖాళీ చేసిన పీసీసీ అధ్యక్షుడి పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, రేవంత్ కు పార్టీ పగ్గాలు లభిస్తే.. తమ ఉనికికే ఎసరు వస్తుందనే భయంతో సీనియర్లంతా ఆ డైనమిక్ లీడర్ దూకుడుకు మోకాలు అడ్డుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ టార్గెట్ గా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. ఆయన బలాన్ని బలహీనపరిచే ప్రయత్నాలూ జరుగుతున్నాయని చెబుతున్నారు. సీనియర్లలో వారిలో వారికి సఖ్యత లేకున్నా.. రేవంత్ ను కార్నర్ చేయడంలో మాత్రం అంతా పోటీ పడుతున్నారని మండిపడుతున్నారు. 

తాజాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ప్రచారంలో ఇలాంటి పరిణామమే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు మద్దతుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈ మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను సమాయత్తం చేస్తున్నారు. దాదాపు అన్ని మీటింగ్ లకు హాజరైన ఉత్తమ్.. ములుగులో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. ఇదే ఇప్పుడు రేవంత్ వర్గం ఆగ్రహానికి కారణం. 

ములుగు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ సీతక్క. ఆమె రేవంత్ రెడ్డి ప్రధాన ఫాలోయర్. రేవంత్ తో పాటే టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు సీతక్క. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ప్రధాన అనుచరురాలిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క రేవంత్ టీమ్ కాబట్టే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ములుగు కాంగ్రెస్ మీటింగ్ కు హాజరుకాలేదని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి చీఫ్ పాలి..ట్రిక్ ఏంటంటూ సీతక్క అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు మద్దతుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి, సీతక్క వర్గం సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ ఎపిసోడ్ కాక రేపుతుండగా.. సీతక్క ఎపిసోడ్ తో అది మరింత పీక్స్ కు చేరుతోంది.