హిందువుగా మారిన  షియా వక్ఫ్‌బోర్డు మాజీ చీఫ్..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం చోటు చేసుకుంది. వివాదాస్పద ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు. 

తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత తతను ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నాడు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింహ ఆనంద సరావతి నిప్పంటించాలని కూడా రిజ్వీ పేర్కొన్నాడు. షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ అయిన రిజ్వీ సుప్రీంకోర్టులో వివాదాస్పద పిటిషన్ దాఖలు చేశారు. పలు రాడికల్ ఇస్లామిక్ సంస్థలు తనను శిరచ్ఛేదం చేయాలని పిలుపునిచ్చినందున ప్రాణహాని ఉందని రిజ్వీ పలుసార్లు వీడియోను విడుదల చేశాడు. అయితే అత్యున్నత న్యాయస్థానం రిజ్వీ పిటిషన్‌ను పనికిరానిదిగా పేర్కొంటూ అతనికి రూ.50,000 జరిమానాను విధించింది. 

వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న ఫిర్యాదు చేశారు. రిజ్వీ ప్రవక్త మహమ్మద్‌ను దూషిస్తూ హిందీలో ఓ పుస్తకాన్ని రాశారని, అందులో అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఒవైసీ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.