భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యోగి.. పాతబస్తీలో టెన్షన్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పాత బస్తీలో టెన్షన్ వాతావరణానికి కారణమయ్యాయి. ఔను నిజమే. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత బస్తీ చార్మినార్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకు కారణం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం అక్కడకు రావడమే ఈ టెన్షన్ కు కారణం. భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం యోగి ఆదిత్యనాథ్ రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యోగి ఆలయ సందర్శన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పాల్గొన్నారు.

భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా    చార్మినార్, మక్కా మసీద్, గుల్జర్ హౌస్, లాడ్ బజార్, హుసేనీ అలం, మొఘల్‌పుర, సర్దార్ మహల్ రోడ్, చౌమహల్ కిల్వట్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతోపాటు ప్లాటూన్ టీమ్స్‌ను మోహరించారు.

సౌత్ జోన్ డీసీపీ భద్రతను పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్, 3 ప్లాటూన్ మహిళా పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.