అమరావతిలో జాతీయ బ్యాంకులు.. కేంద్ర విత్త మంత్రి నిర్మల శంకుస్థాపన
posted on Nov 28, 2025 10:22AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విందు ఇచ్చారు. గురువారం (నవంబంర్ 27) ఉండవల్లిలోని సిఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ కు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి స్వాగతం పలికారు. శుక్రవారం (నవంబర్ 28) అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం కోసం నిర్మలాసీతారామన్ అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెను తన నివాసంలో విందు ఇచ్చారు.

అదలా ఉంటే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, దాదాపు 6,514 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ తెలిపింది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం గ్రామాల్లో ఈ కార్యాలయాలను నిర్మించనున్నారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతంలో భాగంగా కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల కోసం మొత్తం 27.85 ఎకరాల స్థలాన్నిసీఆర్డీయే కేటాయించింది. ఎస్ బీఐ, కెనరా, నాబార్డ్, యూనియన్ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను నిర్మించనున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులపై కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.