ఉదయనిధి స్టాలిన్‌పై సౌందరరాజన్ ఫైర్... ఎందుకంటే?
posted on Oct 20, 2025 4:14PM

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ డిప్యూటీ సీఎం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు' అని చెప్పడంపై బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయనిధి స్టాలిన్ 'హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు' అని చెప్పడంపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆయన శుభాకాంక్షలు తెలిపిన తీరును ఆమె ఖండించారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసని ఆమె మండిపడ్డారు.ఇతర మతాల పండుగల సమయంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కేవలం విశ్వాసం ఉన్నవారికే అని ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు.
హిందూ మతం విషయానికి వచ్చేసరికి వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.హిందుత్వంపై ఉదయనిధి స్టాలిన్‌కు ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. డీఎంకే పార్టీ హిందువులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.