గడువు ముగిసింది.. అప్పు తీర్చండి.. పాక్ కు యూఏఈ అల్టిమేటం.!

posted on: Jul 3, 2026 3:32PM

మూలిగే నక్కపై తాడిపండు పడిందన్న సామెతలా తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న   పాకిస్తాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)   షాక్ ఇచ్చింది. గతంలో తాను అందించిన 2 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 200 కోట్ల రూపాయలు..  తక్షణం చెల్లించాలని అల్టిమేటం ఇచ్చింది. రుణం తీర్చడానికి  గడువు ముగిసిపోవడంతో.. ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా  వెంటనే తిరిగి చెల్లించాలని పాకిస్తాన్‌కు యూఏఈ  పాకిస్థాన్ కు స్పష్టం చేసింది. మూమూలుగా  అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్  దిక్కు తోచని పరిస్థితిలో పడింది.  అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.  

 పాకిస్తాన్ ఎదుర్కొంటున్న విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరతను అధిగమించడానికి యూఏఈ గతంలో  భారీ మొత్తాన్ని రుణంగా అందజేసింది. అయితే, ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన గడువు సమీపించినప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి  చర్యలూ తీసుకోలేదు. దీంతో  యూఏఈ   తమ నిధులను వెనక్కి ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని ఉన్నత స్థాయి దౌత్య ఆర్థిక వర్గాలకు యూఏఈ నుంచి స్పష్టమైన, కఠినమైన సందేశాలు అందాయి. ఈ పరిణామం పాకిస్థాన్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేవేసింది. 

  ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి మరిన్ని రుణాలు పొందడానికి, తమ వద్ద విదేశీ మారక నిల్వలు ఉన్నాయని చూపించుకోవడానికి పాకిస్తాన్ ఇటువంటి ద్వైపాక్షిక అప్పులను వాడుకుంటూ ఉంటుంది. గతంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ గడువును పొడిగించాలని మిత్రదేశాలను కోరడం, అవి అంగీకరించడం పరిపాటి. అయితే..  ఈసారి యూఏ  పాకిస్తాన్ అభ్యర్థనలను   పరిగణనలోకి తీసుకోలేదు. తమ స్వంత ఆర్థిక ప్రణాళికలు, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా పాకిస్థాన్ పై తమ రుణం తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెంచుతోంది.   

యూఏఈ నుంచి వచ్చిన ఈ  హెచ్చరిక వెనుక పాకిస్తాన్ విశ్వాస ఘాతుక వైఖరే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్జాతీయ సమాజంలో నమ్మదగిన ఆర్థిక భాగస్వామిగా పాకిస్తాన్‌కు ఉన్న గుర్తింపు ఇప్పటికే పూర్తిగా క్షీణించింది. ఇచ్చిన మాట ప్రకారం అప్పులు తీర్చకపోవడం, ప్రతిసారీ కొత్త అప్పుల కోసం పాత అప్పులను రీషెడ్యూల్ చేయాలని వేడుకోవడం వల్ల యూఏఈ వంటి ధనిక అరబ్ దేశాలకు కూడా విసుగు తెప్పించింది. ఈ అల్టిమేటం కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు, పాకిస్తాన్ ఆర్థిక నిర్వహణ లోపాలపై యూఏఈ   ప్రదర్శించిన అసంతృప్తిగా ప్రపంచ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.   

చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి వరుసగా బెయిల్ అవుట్ ప్యాకేజీలు పొందుతున్నప్పటికీ..  పాక్ తన అంతర్గత ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం మెరుగుపరుచుకోలేకపోయింది. ఒకవైపు ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుండటం, మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకపోవడంతో ఆ దేశం దివాలా   అంచుకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో..  యూఏఈ గనుక తన 2 బిలియన్ డాలర్లను ముక్కుపిండి వసూలు చేస్తే..  పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న మిగిలిన కొద్దిపాటి విదేశీ కరెన్సీ కూడా ఖాళీ అయిపోతుందంటున్నారు.  ఇది పాకిస్థాన్ అర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం తథ్యం. 

ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్  ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. యూఏఈ పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు, రుణం చెల్లింపునకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని కోరుతూ  రాయబారాలు నడుపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు యూఏఈ   తన పట్టు ఇసుమంతైనా వీడటం లేదనీ, నిర్దిష్ట కాలపరిమితి లోపు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి తీరాల్సిందేనని అల్టిమేటం ఇచ్చింది.  ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులను అమలు చేయలేక సతమతమవుతున్న పాకిస్తాన్‌కు, ఇప్పుడు మిత్రదేశం నుంచి వచ్చిన ఈ తాజా  అల్టిమేటంతో ఏం చేయాలో, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్ధం కాక తలపట్టుకునే పరిస్థితి ఎదురైంది.  .

google-ad-img
    Related Sigment News
    • Loading...