తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు?.. రాజీనామా దిశగా దానం, కడియం అడుగులు
posted on Nov 21, 2025 9:30AM

తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు జరగడం ఖాయమా అంటే ఔననే చెప్పాల్సి వస్తున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే విషయంలో తెలంగాణ స్పీకర్ విచారణ జోరందుకుంది. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి నిర్దుష్ట గడువు విధించడంతో ఆయన విచారణ ప్రక్రియను స్పీడప్ చేశారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి మరీ విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక సారి నోటీసులు అందుకుని కూడా స్పీకర్ విచారణకు గైర్హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెడ్యే కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామా యోచన చేస్తున్నట్లు వారి వారి సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే వారిరువురూ కూడా వారి వారి అనుచరులతో భేటీ అయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలలో దానం, కడియం కూడా ఉన్న సంగతి తెలిసిందే. కాగా పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందీ ఇప్పటికే స్పీకర్ విచరణకు హాజరౌతుండగా కడియం, దానంలు మాత్రమే గైర్హాజరయ్యారు. కాగా మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలూ తాము పార్టీ ఫిరాయించలేదని, టెక్నికల్ గా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే అలా చెప్పే అవకాశం కడియం, దానంలకు లేకుండా పోయింది. ఎందుకంటే వీరిరువురూ కాంగ్రెస్ గూటికి చేరారనడాని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆ కారణంగానే వీరు స్పీకర్ విచారణకు గైర్హాజరయ్యారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం శ్రీహరి 2024 లోక్ సభ ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్య తరఫున బహిరంగంగా ప్రచారం నిర్వహించారు. దీంతో వీరిరువురూ పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి చాన్స్ లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు ఎదుర్కొనే కంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం మేలని ఈ ఇరువురూ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తథ్యమన్న చర్చ జోరందుకుంది.