ఏపీ అంబులెన్సులకు లైన్ క్లియర్.. టీఎస్ సర్కార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న కోవిడ్ పేషెంట్లపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఉత్తుర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల వివాదంపై చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలో విచారణ జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్‌కు ఆస్పత్రి అడ్మిషన్‌ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా... సర్క్యులర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు నాలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌పై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మాట్లాడిన ఏజీ.. రాష్ట్ర ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అధికారులు కరోనాపై రివ్యూ చేసి.. ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఏజీ వాదనలను ఖండిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను నిలువరించడం దేనికని హైకోర్టు ప్రశ్నించింది. 

‘‘పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా? రైట్ టు లైఫ్‌ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా?సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదు. హైదరాబాద్‌లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా.. 300 కి.మీ ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. 

హైకోర్టు వ్యాఖ్యలకు ఏజీ సమాధానమిస్తూ.. అంబులెన్స్‌లను నిలువరించే ముందు సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధన ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే అసలు ఎంట్రీ లేదని కోర్టుకు తెలిపారు. ఆస్పత్రి అనుమతి ఉంటేనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు.