వినాశకాలే విపరీత బుద్ధి!
posted on Sep 20, 2025 3:21PM

అమెరికా అధ్యక్షుడు హెచ్ 1 బి వీసా ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధేగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్. అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ టారీఫ్ లు, విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా.. తాజాగా హెచ్1 బీ వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఏడాదికి లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 88 లక్షల రూపాయలు.
అమెరికా కంపెనీలలో, అమెరికాలోని భారతీయ కంపెనీలలో ఈ హెచ్ 1 బీ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారి సంఖ్య లక్షలలో ఉంటుంది. ఇంత కాలం ఈ విసాల ఫీజును భారత ఉద్యోగులు పని చేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి. ఇకపై అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండక పోవచ్చు. దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు. ట్రంప్ కోరుతున్నది కూడా అదే. అలా కాకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకపోతే.. విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు.. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకుని.. భారత్, చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనాలు, విశ్లేషణలూ కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్ కే మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి.
తమతమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంత మాత్రం ఫీజబుల్ కాదనడంలో సందేహం లేదు. కనుక తొలుత ఉద్యోగుల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గిచుకున్నా..ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించు కుంటూ విదేశాలలో అంటే అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1 బి వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతు గుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.