మంత్రుల వ్యవహారంతో వచ్చే ఓట్లు కూడా పోయేలా ఉన్నాయి..

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీఆర్ఎస్ అధినాయకత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోరాడుతోంది. ఈ ఎన్నికలలో ఓడితే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు మరత్న చెలరేగిపోతాయని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఏకంగా మంత్రుల‌ను ఇన్ చార్జ్ లుగా నియ‌మించారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న జిల్లా మంత్రుల‌కు అదనంగా ఈ మంత్రులు అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు.

అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రుల మాట‌లు, వ్య‌వ‌హరిస్తున్న తీరు టీఆర్ఎస్ పార్టీనే భ‌య‌పెడుతోంది. ఈ మంత్రులు జనంలోకి వెళ్లి ప్ర‌చారం చేసి కొత్త ఓట్లు తేవడం అసంగతి దేవుడెరుగు… అసలు ఉన్న ఓట్లు కూడా పోయేలా ఉన్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. కొత్తగా ప్రచారంలోకి దిగిన ఈ మంత్రి పుంగవులు "మీరు ఓటు వేయకపోతే మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది ఈ ఎన్నికలయ్యాక చూసుకుంటాం" అని ఒకరు… మా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో లబ్ది పొంది మాకు ఒక ఓటు వేయకపోతే వారి కుటుంబాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని మ‌రో మంత్రి భయపెట్ట‌డం తాజాగా ఓటర్లలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మంత్రుల వ్య‌వ‌హ‌రం చూస్తుంటే టిఆర్ఎస్ అభ్యర్థుల ఓట‌మి తప్పదని ఫిక్స్ అయిపోయారు అని సొంత‌పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం నానాపాట్లు పడుతున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు కొన్ని వివాదాస్ప‌ద కామెంట్స్ చేస్తున్నారని కేడర్ మొత్తుకుంటోంది. తాజాగా ఈ మంత్రులు చేసిన వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.