మధ్యాహ్నానికే ప్లీనరీ ఖాళీ.. కేసీఆర్ ప్రసంగాన్ని పట్టించుకోని కేడర్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వార్షికోత్సవం అంటే ఒకప్పుడు ఎంతో సందడి ఉండేది. రెండేళ్లకోసారి జరిపే పార్టీ ప్లీనరీని గులాబీ శ్రేణులు పండుగలా జరుపుకునేవి. రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీలో చర్చలు రసవత్తరంగా సాగేవి. ఇక గులాబీ బాస్ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలంటే కేడర్ కు ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్దగా వినేవారు పార్టీ నేతలు, కార్యకర్తలు. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసే ప్రసంగాలు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర ప్రజలు టీవీల్లో ఆసక్తిగా వీక్షించేవారు.

కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.  హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వెలవెలబోయింది. గతంలో ఉన్న వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి జోష్ కనిపించలేదు. ఏదో పార్టీ ప్లీనరీకి వచ్చామంటే వచ్చాం అన్నట్లుగా నేతలు కనిపించారు. గ్యాలరీల్లో ఎలాంటి హడావుడి కనిపించలేదు. నిజానికి 2109లో లోక్ సభ సభ ఎన్నికల కారణంగా టీఆర్ఎస్ ప్లీనరీ జరగలేదు. కరోనా కల్లోలంతో 2020లోనూ జరపలేదు. అంటే నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు ప్లీనరీ జరుగుతోంది. అది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 20 ఏండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ద్వదశాబ్ది వేడుక.

ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుక అయినా  గులాబీ కేడర్ లో పూర్తి నిర్లిప్తత కనిపించింది. గతంలో కేసీఆర్ వేదికపైకి వస్తున్నాడంటే సభా ప్రాంగణమంతా దద్దరిల్లేలా నినాదాలు చేసేవారు. కాని ఈసారి ప్లీనరీలో అలాంటిదేమి కనిపించలేదు. కేసీఆర్ వేదికపై తిరుగుతూ అభివాదం చేస్తున్నా రెస్పాన్స్ రాలేదు. ఇక కేసీఆర్ ప్రసంగం చప్పగానే సాగింది. అధ్యక్ష ఉపన్యాసం దాదాపు గంటసేపు చేసినా.. కేడర్ లో ఉత్సాహం కనిపించలేదు. విపక్షాలను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నా గులాబీ ప్రతినిధులు ఏమాత్రం స్పందించలేదు. అంతేకాదు కేసీఆర్ ప్రసంగిస్తుండగానే చాలా మంది నేతలు, ప్రజా ప్రతినిధులు భోజనం కోసం పరుగెత్తడం కనిపించింది. 

ప్లీనరీలో కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే ప్రసంగించారు. అయినా కేసీఆర్ స్పీచ్ వినకుండా ప్రతినిధులు బయటికి వెళ్లడం టీఆర్ఎస్ ముఖ్యనేతలను కలవరానికి గురి చేసింది. ఇక లంచ్ చేయగానే చాలామంది ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. వందలాది వాహనాలు మధ్యాహ్నమే  వెళ్లిుపోయాయని పోలీసులు కూడా చెప్పారు. కేసీఆర్ ముగింపు ప్రసంగం సమయంలో సభలో సగం మంది కూడా లేరంటే ప్లీనరీ ఎంత చప్పగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. కేడర్ నుంచి స్పందన లేకపోవడం వల్లే కేసీఆర్ కూడా గతంలో కంటే చాలా సాదాసీదాగా మాట్లాడారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ప్రసంగంలోనూ గతంలో వాడి వేడి లేదంటున్నారు.

మొత్తంగా టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగం, ఇతర నేతల ప్రసంగాలు, కేడర్ స్పందనను బట్టి... అధికార పార్టీలో నిస్తేజం అలుముకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై పెరిగిపోతుందనే అభిప్రాయం ప్లీనరీ ద్వారా స్పష్టమైందని తెలుస్తోంది.