సిరివెన్నెలకు నివాళి.. హోదా లేదట.. జగనన్న బాదుడు..టాప్ న్యూస్@8PM

ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధ పడుతున్నారు. ఈనెల 24న హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు నిపుణులైన వైద్య బృందం చికిత్సను అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.  సాయంత్రం 4.07 గంటలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
----
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని చెప్పారు. 
-----
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని అన్నారు.
----
ఏపీ ప్రభుత్వం కన్ను  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై పడిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎన్టీఆర్ వర్సిటీ డబ్బును రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మళ్లించేందుకు దుష్ట ఆలోచన చేసిందని విమర్శించారు.కెనరా బ్యాంకులో దాచిన డబ్బును ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు
-----
జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే  రాజోలు నియోజకవర్గంలో రోడ్లకు ప్రతి రెండున్నర అడుగులకు ఒక గొయ్యి ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అంధకారంలో కూరుకు పోయిందన్నారు నాదెండ్ల మనోహర్. 
----
రాష్ట్రంలోని ప్రజలపై మరో పన్ను బాదుడు మొదలు కానుంది. ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
----
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో వరి వేయద్దని చెప్పినపుడు.. మరి  ఏ పంట వేయాలో చెప్పాలని కేసీఆర్‌‌ను ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. వాటిని రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు. 
-----
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
-------
మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. 
---
 భారత సైన్యం నిఘా సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లను లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుండటంతో చైనా కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సేకరణ నిబంధన క్రింద ఈ డ్రోన్లను మన దేశం కొనుగోలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీటిని మన దేశానికి అప్పగించడంలో కొన్ని నెలలు జాప్యం జరిగింది.