ఏపీలో గుండు కొట్టించుకున్నా పన్నే!.. రేవంత్ కు డిపాజిట్ రాదట.. బిల్లులన్నీ మాఫీ.. టాప్ న్యూస్@1PM

మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆనందబాబు ఇంటికి రావడంపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు.
-------
ఏపీలో కరెంట్ చార్జీల బాదుడుపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు వాడినా, వాడకున్నా ప్రభుత్వం చార్జీల బాదుడే బాదుడు అని అన్నారు. ముందు ట్రూఅప్ చార్జీలు అంటే ఏమో అనుకున్నామని.. కానీ ట్రూత్ ఏమంటే కరెంటు వాడకపోతే బాదే బాదుడు నభూతో నభవిష్యత్ అని వ్యాఖ్యానించారు. జుట్టు ఉన్న లేదా గుండు కొట్టించుకున్నా పన్నె పన్ను అన్న తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందని లంకా దినకర్ దుయ్యబట్టారు. 
---------
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ కోతలపై టీడీపీ పోరు బాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు దిగారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్‌కు ఊరి తాళ్లు బిగించుకోని రైతుల నిరసన ప్రదర్శనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  
------
సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడుతున్నారని, ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధారాలతో సహా వాస్తవాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని, మోదీ, అమిత్‌షా చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు.
----
పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించారు. ధర్మం తగ్గిందని... అహం పెరిగిందన్నారు. జనం లేని జాతర చూడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఒకొక్క మతంపై ఒకొక్క విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. తమ వంశాచారం అనుసరించి మొక్కుబడులు చెల్లించుకున్నామని అశోక్ గజపతిరాజు తెలిపారు. 
-----------
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తెరాస గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. 
-----
బీజేపీ లేఖ వలనే దళితబంధు పథకం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. 
---
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిని పోలీసులు చితకబాదారు.  దెబ్బలు తాళలేక భక్తుడు మృతి చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ అటవీశాఖ కౌంటర్ అసిస్టెంట్ కార్తీక్‌గా గుర్తించారు. కార్తీక్ ఆదివారం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చాడు. కాగా అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు గాయపర్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో కార్తీక్ మృతి చెందాడు. 
----
కీలకమైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ ఛన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు ప్రకటించింది.పంజాబ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఛార్జీలు, గ్రామాల్లో గ్రామీణ మంచినీటి సరఫరా పథకాల పెండింగ్ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది.ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ ఛన్నీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంపై రూ .1,800 కోట్ల ఆర్థిక భారం మోపే నిర్ణయం తీసుకున్నారు.
----
మాదకద్రవ్యాల కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటూ బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్, ఇతరులకు నార్కోటిక్స్ కండ్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌‌ బోధలను సాయం తీసుకుంటున్నారు. ఇస్కాన్ ఆలయ పూజారులు, మత పెద్దలతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.