పీఆర్సీ స‌మ్మె.. జేసీకి ఝ‌ల‌క్‌.. సీఐడీ సునీల్‌కు చుక్క‌లే.. టాప్‌న్యూస్ @7pm

1. పీఆర్స్‌పై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని ఉద్యోగ సంఘాల‌ నేత‌లు చెప్పారు. ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని తేల్చి చెప్పారు. 

2. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారత్‌లోని చైనా రాయబారి సున్‌ వెయిడాంగ్‌ లేఖ రాశారు. చంద్రబాబు కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని చైనా రాయబారి ఆకాంక్షించారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని లేఖలో సూచించారు.  

3. సీఎం కేసీఆర్‌ను కలుస్తానంటూ ప్రగతిభవన్‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి అవమానం జరిగింది. అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌నైనా కలుస్తానని జేసీ అన్నా వినిపించుకోలేదు.  అనుమతి కావాల్సిందేనని చెప్పడంతో చేసేదేమీలేక జేసీ వెనుదిరిగి వెళ్లిపోయారు. 

4. తాము ఏ కార్యక్రమం చేస్తున్నా కొవిడ్ నిబంధనల పేరుతో  పోలీసులు అడ్డుకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ను ముట్టడిస్తున్నారని.. 317 జీవోపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నాటకంలో పాత్రధారులు టీఆర్‌ఎస్,  సూత్రధారులు బీజేపీ అని విమర్శించారు. 

5. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని.. ఛార్జ్ షీట్ కూడా వేశార‌ని తెలిపారు. తాజాగా, సునీల్ కుమార్ త‌న భార్య, ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సునీల్‌ను తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. 

6. వైసీపీ ఎమ్మెల్యే ప‌ద్మావతి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గుంజేపల్లి గ్రామస్థులపై సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ త‌న‌పై పోస్ట‌ర్లు వేయ‌డంపై ప‌ద్మావ‌తి మండిప‌డ్డారు. తన భర్త సాంబశివారెడ్డికి కొవిడ్‌ సోకిందని.. తామంతా క్వారంటైన్‌లో ఉన్నామని వివరణ ఇచ్చారు. 

7. రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొడాలి నానిపై కామెంట్స్ చేశారు. "గుడివాడను లండన్, పారిస్, లాస్ వెగాస్‌ల సరసన నిలిపారు. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను నాని కల్పించారు" అంటూ వ‌రుస‌ ట్వీట్స్‌ చేశారు వర్మ. ఇటీవ‌ల సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో కొడాలి నాని ఎవ‌రో త‌న‌కు తెలీదంటూ హాట్ కామెంట్స్ చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు కొడాలిని పొగుడుతూ ట్వీట్స్ చేసి.. ఆ డ్యామేజీని ఇలా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. 

8. తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చేసిన ఫీవ‌ర్‌ సర్వేలో తేలింది. రానున్న రెండు వారాల్లో కేసులు మ‌రింత‌ పెరుగుతాయని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 లక్షల మందికి పైగా ల‌క్ష‌ణాలు నమోదయ్యాయని, జిల్లాల్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సర్వే నివేదిక తేల్చింది. 

9. ఏపీలో గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు వ‌చ్చాయి.  కొవిడ్‌ వల్ల రాష్ట్రంలో 8 మంది చ‌నిపోయారు. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి. 

10. కరోనాతో మరణించిన బాధితుల కుటుంబాలకు కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వర్చువల్‌ విచారణకు ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ హాజరయ్యారు. కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. కొవిడ్ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన 45కోట్ల బకాయిలను ఏపీ సర్కార్ పెండింగ్‌లో పెట్టడాన్ని త‌ప్పుబ‌ట్టింది.