ప్రతి వస్తువుకీ ఉంటుంది ఓ ఎక్స్పైరీ డేటు

మందులు వేసుకునేటప్పుడు వాటికి ఎక్స్పైరీ దగ్గరపడిందేమో అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. బ్రెడ్డు, జాము, సాస్ లాంటి పదార్థాలు తినేటప్పుడు వాటిని తయారుచేసిన తేదీని చూసుకుంటాం. ఆఖరికి గోధుమపిండీ, ఇడ్లీరవ్వా వాడేటప్పుడు కూడా వాటి ఎక్స్పైరీ గమనించుకుంటాం. కానీ రోజూ వాడే వస్తువులకి కూడా ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం అస్సలు గమనించుకోము. వాటిని ఎందుకు గమనించుకోవాలో ఇప్పుడు చూద్దాం...

 

దిండు (Expiry రెండేళ్లు)

 

 

దిండుని వాడగా వాడగా దాని ఆకారమే మారిపోతుంటుంది. తల పెట్టే చోట దిగబడిపోతుంది. అదే దిండుతో పడుకుంటే మెడకి సంబంధించిన సమస్యలు ఖాయం అంటున్నారు. అంతేకాదు! రోజుల తరబడి దిండుని వాడటం వల్ల దానిలో అణువణువూ దుమ్ముకణాలతో (డస్ట్ మైట్స్) నిండిపోతాయి. ఇవి చర్మవ్యాధుల దగ్గర్నుంచీ ఊపిరితిత్తుల సమస్యల వరకూ అనేక ఇబ్బందులకి దారితీస్తాయి.

 

టూత్ బ్రష్ (Expiry మూడునెలలు)

 

 

ఈ మధ్య ప్రకటనల్లో మనం తరచూ వింటున్న మాటే ఇది. రెండు మూడు నెలలపాటు పళ్లు తోముకున్న తర్వాత బ్రష్ అరిగిపోవడం సహజం. ఒకవేళ అరగకపోయినా కూడా బ్రిసిల్స్ గట్టిపడిపోవడం మాత్రం ఖాయం. అలాంటి బ్రష్తో తోముకోవడం వల్ల పళ్లు దెబ్బతినక మానవు. పైగా జలుబు, దగ్గులాంటి సందర్భాలలో మన ఒంట్లో ఉండే రోగక్రిములు బ్రష్ మీదకు కూడా చేరుకుంటాయి.

 

అంటుగుడ్డలు (Expiry వారం)

 

 

మన ఇంట్లో వాడే అంటుగుడ్డలు ఎంత భయంకరంగా ఉంటాయో.... ఒక్కసారి వంటింట్లోకి తొంగిచేస్తే తెలుస్తుంది. అయినాసరే వీటిని నెలల తరబడి వాడేయడం ఓ వైపరీత్యం. అంటుగుడ్డలో ఉండే మురికి వల్ల నానారకాల బ్యాక్టీరియా దాని మీద ఉంటుందనీ... పైగా తడిగా ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 89 శాతం అంటుగుడ్డల మీద ఈ.కోలీ లాంటి భయంకరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తేలింది. అందుకని వీటిని వారం మించి వాడవద్దని నిర్మొహమాటంగా సూచిస్తున్నారు.

 

చెప్పులు (Expiry ఆరునెలలు)

 

 

రన్నింగ్ షూస్ అయితే ఓ 300 కిలోమీటర్లు నడిచాక అరిగిపోవడం సహజం. అలాగే చెప్పులు కూడా ఆ ఆర్నెళ్ల తర్వాత అరిగిపోవడం లేదా గట్టిపడటం జరుగుతుంది. ఇక వాటి మీద ఫంగస్ పేరుకునే ప్రమాదమూ లేకపోలేదు. అలాంటి పాదరక్షలు వాడటం వల్ల నడక మీదా, కాలి కండరాల మీదా ప్రభావం చూపుతుంది.

 

చాపింగ్ బోర్డు (Expiry ఏడాది)

 

 

ఈ రోజుల్లో కూరగాయలు తరిగేందుకు ప్రతి ఇంట్లోనూ చాపింగ్ బోర్డు కనిపిస్తోంది. కొన్నాళ్లకి దీని మీద గాట్లు పడి, మురికిమురికగా కనిపించడమూ సహజమే. ఆ గాళ్లలో సూక్ష్మజీవులు ఉండటమే సహజమే! ఇక మాంసం తరిగితే పరిస్థితి చెప్పనవసరం లేదు. పైగా చెక్కతో చేసిన చాపింగ్ బోర్డులో అయితే సూక్ష్మజీవులు ఉండే అవకాశం మరింత ఎక్కువ. మన టాయిలెట్ సీటు మీద కంటే ఇలాంటి చాపింగ్ బోర్డుల మీదే ఎక్కువ బ్యాక్టీరియా కనిపిస్తుందని ఓ పరిశోధన తేల్చింది.

 

ఇవే కాదు దువ్వెనలు, పౌడరు అద్దుకునే స్పాంజిలు, కార్పెట్లు, దుప్పట్లు.... ఇలా మన కంటికి కనిపించే ప్రతి వస్తువుకీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించకుండా ప్రతి వస్తువునీ నెలలు, సంవత్సరాల తరబడి వాడుతుంటే సమస్యలు తప్పవు.

- నిర్జర.