ఇదేం వెర్రిరా నాయ‌నా..! 

రెండు స్థంభాల‌కు తాడు గ‌ట్టి ఓ పిల్ల క‌ర్ర ఆదారంతో ఆ తాడు మీద న‌డుస్తూ ఒక వేపు నుంచి మ‌రో వేపు న‌డుస్తుంది. ఈలోగా నేల మీద జ‌నం చూస్తు ఆశ్చ‌ర్య‌ పోతూంటారు. ఒక‌డు డ‌ప్పు వాయిస్తూ పాటందుకుం టాడు.. ఇది మ‌నం చిన్న‌పుడు చూసిన‌, ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేని గొప్ప ఫీట్. దీనికే  మ‌నం  ఓర్నీ ఏం న‌డిసిందిరా! అనుకున్నాం. మ‌రో వ్య‌క్తి కాలుతున్న క‌ర్ర‌ముక్క కిల్లీ వేసుకున్న‌ట్టు నోట్లో వేసుకుని క్ష‌ణం త‌ర్వాత త‌న‌కేమీ తెలీన్న‌ట్టు బ‌య‌టికి ఉమ్మేస్తా డు. ఇదో గొప్ప ఫీట్‌! మ‌రి గాల్లో పుల్ల‌ప్స్ చేసేవాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!

ఇటీవ‌లికాలంలో ఫిట్నెస్ పిచ్చి పెద్ద పెద్ద న‌గ‌రాల నుంచి మారుమూల ప‌ల్లెల వ‌ర‌కూ ప‌ట్టుకుంది. కుర్రాళ్ల‌కి వారి సినీ హీరోలు స‌ల్మాన్‌, ప్ర‌బాస్‌లా త‌యారైపోతే అమ్మాయిలు ఢామ్ అని ప‌డతార‌ని గొప్ప న‌మ్మ‌కం. ఈ పిచ్చిలో అనేక వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చేసే వ్యాయామాల‌కు ప‌రిమితి ఉంటుంది. కానీ ఓవ‌రాక్ష‌న్ చేస్తే అది ప్ర‌మాదాన్ని కొనితెచ్చుకున్న‌ట్టే అవుతుంది. అన్న‌ట్టు ఈ ఫిట్నెస్ పిచ్చి ప్ర‌పంచ‌దేశాల్లో ఏకంగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కెంత‌గా ప‌ట్టింది. ఏదో ఒక‌టి చేసే బదులు పుష‌ప్స్ చేసి రికార్డుల్లోకి ఎక్కాల‌నే కుర్రాళ్ల సంఖ్య మ‌రీ పెరిగిపోయింది. ఆ మ‌ధ్య స్టాన్ బ్రౌనీ స్నేహితుడు అర్జెన్ ఆల్బ‌ర్స్ ఏకం గా ప్ర‌పంచ‌రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడ‌ట‌. అత‌ను వాళ్లింటో పుష‌ప్స్ చేస్తూ జ‌నాన్ని, గిన్నిస్ సంస్థ అధికారుల‌ను పిలిచి టీలు, కాఫీలు ఇచ్చి వాళ్లెదుట పుష‌ప్స్ చేయ‌లేదు. అత‌గాడి పిచ్చికి ఏకంగా హెలికాప్ట‌ర్ కావాల్సి వ‌చ్చింది. అదెలా సేసేడ్రా బావా.. అని మ‌నూళ్లలో అనుకునేలాగానే పూర్తి చేసి రికార్డు సాధించారు.
 
ఈ ఏడాది జూలై 6న బెల్జియం  ఆంట్వ‌ర్ప్‌లో స్టాన్‌, ఆల్బ‌ర్స్ లు ప్ర‌పంచ‌రికార్డు అధిగ‌మించే పుల‌ప్స్ పోటీకి సిద్ద‌ప‌డ్డారు. హెలికా ప్ట‌ర్ వెళుతూంటుంది, దానికి వేలాడుతూ పుల‌ప్స్ చేయ‌డం. ఏమాత్రం ప‌ట్టు త‌ప్పినా, చేసే క్ర‌మం త‌ప్పినా మ‌నిషి ద‌క్క‌డు. కానీ వాళ్లిద్ద‌రికీ ప్రాణాల‌కంటే ప్ర‌పంచ రికార్డు మీదే ప్రేమ‌. అదే సాధించారు. వీళ్లు ఏకంగా 25 పుల‌ప్స్ తీసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  వీళ్లు సామాన్య‌లు కాద‌నుకున్నారు అంద‌రూ. కింద‌కి రాగానే తాకి మ‌రీ చూశారు.. బ‌తికే ఉన్నారా, పోయా రా అని! ఇలా హెలికాప్ట‌ర్ పుల‌ప్స్ చేయ‌డం ఇపుడు ప్ర‌పంచ‌పోటీల్లో భాగం చేస్తార‌ట‌!