మొన్న ఉల్లి... నేడు టమోటా
posted on Oct 6, 2025 7:30PM

మొన్నటిదాకా ఉసురుమనిపించిన ఉల్లి, నేడు బోరుమనిపిస్తున్న టమోటా- ఏ పంట పండించిన ఏడుపు మాత్రమే మిగిల్చుకుంటున్న రైతు. నిన్న మొన్నటి దాకా ఉల్లి ధరలు పతనమై రైతుల కంట్లో కన్నీరు మిగిల్చాయి. ఉల్లితో వచ్చిన నష్టాన్ని టమోటాతో పూడ్చూకుందామంటే టమోటా కూడా నిరాశ మిగిల్చింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో టమోటా పంటకు మదనపల్లి మార్కెట్ తర్వాత అంత పెద్ద మార్కెట్ కర్నూలు జిల్లా పత్తికొండలో ఉంది.
పత్తికొండ, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతంలో 60 శాతానికి పైగా పంట భూముల్లో టమోటాను రైతులు సాగు చేస్తుంటారు. ఏడాది పొడవునా మంచి ధర ఉంటూ నిత్యం డిమాండ్ ఉండే టమోటా ఇక్కడి రైతులకు పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే ధర పతనమవుతూ రైతులను అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తుంది.
పత్తికొండ మార్కెట్లో నిన్న టమోటా ధరలు పూర్తిగా పతనమై, రైతులు తాము పండించిన పంటను రోడ్లపై పారబోసి ఆందోళన చెప్పటాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం దాకా కిలో 5 నుంచి పది రూపాయలు దాకా పలికిన టమోటా ధర ఒక్కసారిగా కిలో రూపాయికి దిగజారింది. దీంతో రైతులు తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదని, వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మార్కెట్కు తీసుకువచ్చిన టమాటాను రోడ్లపైన, పశువులకు మేతగా వేసి ఆందోళన బాట పట్టారు.
రైతులు ఆందోళనలతో గుత్తి నుంచి మంత్రాలయం వెళ్లే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రతి ఏడాది టమోటా నమ్ముకున్న రైతులు అప్పుల ఊబిలోకి కూరుకపోతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా గతంలో అనేకం జరిగాయి. రైతుల ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రభుత్వం టమోటా కు కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున మద్దతు ధరను ప్రకటించింది.
అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు కొంటూ అదే మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. అలాగే బహిరంగ మార్కెట్లో కిలో 25 నుంచి 30 రూపాయలు దాకా అమ్ముతూ రైతుల పొట్ట కొడుతున్నారు. గత 30 సంవత్సరాలుగా పత్తికొండ మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలలో కానీ, పాలకుల తీరులో కానీ ఎటువంటి మార్పు రావటం లేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టమోటా రైతుల సమస్యల శాశ్వత నివారణ కోసం పత్తికొండ పరిసరాల్లో టమోటా ప్రాసెసింగ్ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటి పనులు మందకోడిగా కొనసాగుతూ రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో రైతుల కష్టాలు అలానే ఉండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకొని టమోటా కు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతుల కోరుకుంటున్నారు.