TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో ఉత్తుత్తి సస్పెన్షన్లే.!

Published on: Sat Aug 29, 2026 12:33PM

వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు.  

అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు.  ఒక హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. 

ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు.  దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.  ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు. 

{Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}