ప్రయాగ్ రాజ్ కు శ్రీవారి కళ్యాణ రథం

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం వెళ్లనుంది. ఈ కల్యాణ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మర్ బీఆర్ నాయుడు బుధవారం (జనవరి 8)ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు.  జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా  కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం దీని ద్వారా కలుగుతుంది.

ఈ నమూనా ఆలయంలో నాలుగు సార్లు శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. కుంభమేళా జరుగుతున్న రోజులలో జనవరి 18,26 తేదీలోనూ, ఫిబ్రవరి 3 ,12 తేదీ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.    ప్రపంచం లోనే అతి పెద్ద ఉత్సవమైన కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అలా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే ఉద్దేశంతోనే అక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  కుంభమేళా సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో జరిగే కల్యాణోత్సవాల కోసం శ్రీవారి కళ్యాణ రథం బుధవారం ప్రయాగరాజ్ కు బయలుదేరింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu