ఒకే దెబ్బకు మూడు పిట్టలు కేసీఆర్ కొత్త వ్యూహం ..

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార తెరాస గెలిచింది.అయితే, ఈ గెలుపు ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు ముఖ్యమంతి కే.చంద్రశేఖర రావు సహా పార్టీ నాయకులు ఎవరికీ సంతృప్తి ఇవ్వలేదు.వంద మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు అందరినీ, నెలరోజులకు పైగా నియోజకవర్గానికి కట్టి పడేసి, ఇంటింటికీ తిప్పినా, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని వరాల జల్లు కురిపించినా, ఇంకా చాలా చాల చేసినా చివరకు ఓటుకు ఐదారు వేల రూపాయల చొప్పున పంచినా, తెరాస అభ్యర్ధికి వచ్చింది, పదివేల మెజారిటీ. అందుకే మునుగోడులో తెరాస సాధించిన విజయం ముఖ్యమంత్రికి సంతృప్తిని ఇవ్వలేదని, పార్టీ వర్గాల సమాచారం. తెరాస పదివేల మెజారిటీ వచ్చినా, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్’లో ఉంటే , అదో ‘తుత్తి’ అన్నట్లుగా ఉండేది, కానీ, బీజేపీ సెకండ్ ప్లేస్ కి రావడమే కాదు, గెలిచినంత పనిచేయడం అసలే మింగుడు పడడం లేదని అంటున్నారు.  

అందుకే, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, ముఖ్యమంత్రికి సంతృప్తి ఇవ్వలేదు సరికదా, తెరాస రాజకీయ ఎత్తుగడలు,వ్యూహాలను పునరాలోచించుకోవలసిన అవసరాన్నిగుర్తు చేసిందని పరిశీలకులు అంటున్నారు. మునుగోడులో  తెరాస ఆశించిన మెజారిటీ సాధించలేక పోవడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ అయినా రాక పోవడం, కాంగ్రెస్ నాయకుల కంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎన్నికల వ్యూహకర్తలను మరింత ఆందోళనకు గురి చేసిందని అంటున్నారు. 

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ కోరుకుంటున్నారు. ముక్కోణపు పోటీ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలి, తెరాస గెలుపు సునాయాసం అవుతుందని ఆశించారు. అందులో భాగంగానే, ఒక వ్యూహం ప్రకారం ఓ వంక కాంగ్రెస్ ను బలహీన పరుస్తూ, మరో వంక బీజేపే ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే తెరాసకు ఇక తిరుగుందడనే లెక్కతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిటైల్ గా కొని టోకున పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు, కానీ, అందుకోసమే కాచుకు కూర్చున్న బీజేపీ ముప్పును ఎందుకనో కేసీఆర్ గుర్తించలేక పోయారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

నిజానికి, మోడీ షాల బీజేపీ మొదటి నుంచి కూడా  తమకు ఏ మాత్రం పట్టులేని రాష్ట్రాలలో, ‘టార్గెట్ ద సెకండ్ ఫస్ట్’ ఫార్ములానే ఫాలో అవుతూ వస్తోంది. అంటే, ముందు సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, తప్పించి, ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అధికార పార్టీని టార్గెట్  చేయడం కమల దళం ఒక ఫిక్సెడ్ ఫార్ములాగా ఫాలో అవుతోంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా బీజేపీ ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. తెలంగాణలోనూ, బీజేపీది అదే వ్యూహం. అయితే, కాగల కార్యంలో  సగం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా, బీజేపీ లక్ష్యాన్ని,చాలా వరకు తెరాస పూర్తి చేసింది. ఏకంగా 12మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించింది. అందుకు అదనంగా, కాంగ్రెస్ లో అంతర్గత కలహాలను కావలసిన ఇంధనం సైతం తెరాస అందించిందని అంటారు. ఈ నేపధ్యంలో బీజేపీ ఏకు మేకై కూర్చుంది. ఇదేమి కొత్త విషయం కాదు, అయితే మునుగోడు ఫలితాల తర్వాత కానీ  తెరాసకు చేసిన తప్పు తెలిసి రాలేదు.

అయితే, ఇప్పడు తెలిసినా చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకున్న చందంగా పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, తెరాస నాయకులు మాత్రం ఇంకా సమయం మించి పోలేదని అంటున్నారు.అలాగే ముఖ్యమంత్రి కేసేఆర్   ఇంతవరకు ఫాలో అవుతూ వచ్చిన వ్యూహాన్ని ఇప్పడు రివర్స్ లో ముందుకు తీసుకుపోయే కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారని  అంటున్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద యాత్రపై తెరాస కార్యకర్తల దాడి, హైదరాబాద్ లో మెగా డ్రామా మధ్య ఆమె అరెస్ట్ జనసేన అధినేత హటాత్తుగా తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టి సెంటిమెంట్ ను రగిల్చే వివాదస్పద వ్యాఖ్యలు చేయడం,ఈ అన్నిటినీ మించి, మంత్రి హరీష్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చుకోవడం... ఇలా ఒకదానితో ఒకటికి సంబంధం లేనట్లు జరుగతున్న పరిణామాలను  కలిపి చూస్తే  ఈ పరిణామాలు కేసీఆర్ రివర్స్ వ్యూహానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. 

అలాగే, ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా, కేసేఆర్ కొత్త వ్యూహం ఉందని అంటున్నారు. ఓ వంక ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్లుగా, ప్రజలు, పార్టీలు. పత్రికలు, మీడియా ఎవరూ అంతగా పట్టించుకోని, వైసీపీటీపీ నాయకురాలు షర్మిలను అరెస్ట్ చేయడం ద్వారా, ఆమెకు కొంత మైలేజి కల్పించడం, తద్వారా దీర్ఘకాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంత ఆమె వైపుకు తిప్పేందుకు  తెరాస వ్యూహ కర్తలు షర్మిల అరెస్ట్ డ్రామాను పండించారని అంటున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ ‘బియ్యం’ వ్యాఖ్యలతో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తే, హరీష్ రావు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం వెనక  ఇంకా చాలా లోతైన వ్యూహమే ఉండి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, మునుగుగోడు తర్వాత తెరాస వ్యూహం మారిందనే మాత్రం అందరు అంగీకరిస్తున్న నిజం. అంటున్నారు.