Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రినిడాడ్ సింహం, హిందూ నాయకుడు.. భదాసే సగన్ మరాజ్
posted on: Jun 9, 2026 4:33PM

కరీబియన్ దేశం ట్రినిడాడ్‌లో 2022లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి . ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న హిందూ సంఘాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి కరేబియన్ దేశాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. వలసవాద ట్రినిడాడ్‌లో హిందువుల అణచివేతను సమర్ధంగా ఎదుర్కొన్ని నిలబడ్డారు భదాసే సగన్ మరాజ్. అణచివేతకు గురవుతున్న హిందూ వలస వాదులకు ఆయన అండగా నిలవడంతో అక్కడి పెత్తందారులు అతనికి భయపడ్డారు. భదాసె పుట్టే నాటికి 1800ల మధ్యలో, బ్రిటిష్ సామ్రాజ్యం బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా, కరేబియన్ దేశాల్లోని చక్కెర తోటల కోసం అక్కడకు వలస వచ్చిన వారికి శ్రమశక్తి అవసరమైంది. దాంతో భారతీయులను ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌గా పిలవబడుతున్న భోజ్పురి మాట్లాడే ప్రాంతాల వారిని అక్కడకి తరలించి పనుల్లో నియమించుకున్నారు. వారిని ఓడల్లోకి ఎక్కించి, వేల మైళ్ల దూరంలోకి తీసుకువెళ్లారు. తరతరాలుగా, ఆ సమాజం ప్రార్థనలు, పండుగలు, కథల మీద ఆధారపడి, కఠినమైన పరిస్థితులలో భాష మరియు ఆచారాల శకలాలను కాపాడుకుంటూ మనుగడ సాగించింది. భదాసే పుట్టేనాటికి, ట్రినిడాడ్లోని హిందూ సమాజం ఒక శతాబ్దపు ఒప్పంద బానిసత్వాన్ని తట్టుకుని నిలబడింది. కానీ అభివృద్ధి చెందలేదు. వారికి పాఠశాలల ప్రవేశం దాదాపుగా లేదు, అర్థవంతమైన చట్టపరమైన రక్షణలు లేవు, రాజకీయ ఉనికి అసలే లేదు.
గ్రామ విషాదం నుండి పారిశ్రామిక మేధస్సు వరకు
భదాసే 1920 ఫిబ్రవరి 29న ట్రినిడాడ్ చక్కెర పరిశ్రమకు కేంద్రమైన కరోని గ్రామంలో జన్మించారు. అతని తండ్రి, మాథ్యూ మహారాజ్, గ్రామ పెద్ద, కర్రసాములో ఆరితేరినవాడు. అతని అధికారం ఎంత స్పష్టంగా ఉండేదంటే.. స్థానిక నియమాలను సమర్థవంతంగా రూపొందించి, అమలు చేసేవాడు కూడా అతనే. ఆ బలప్రదర్శన అతన్ని కాపాడలేకపోయింది. 1933లో, భదాసేకు కేవలం పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు, అతని తండ్రి ఇంటి వాకిలి కింద ఉయ్యాలలో పడుకుని భగవద్గీత చదువుతుండగా, ఒక ముఠా వచ్చి అతన్ని చంపేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే, వారు భదాసే మామను ఒక రాయికి కట్టి, కరోని నదిలో ముంచి హత్య చేశారు. పారిపోవాల్సి రావడంతో, ఆ బాలుడు తన అమ్మమ్మ దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సంవత్సరాలలో, అతను కుస్తీ నేర్చుకుని, ఇరవై ఏళ్ల వయస్సుకే ట్రినిడాడ్లోనే అత్యుత్తమ కుస్తీవీరులలో ఒకడిగా ఎదిగాడు.
అతను తన తండ్రి మరణంతో కుంగి పోలేదు. వల్ల కలిగిన దుఃఖంలో మునిగిపోలేదు. ఆ చిన్ననాటి హింసే ఒక చీకటి నేపథ్యంగా మారి, హిందూ కరేబియన్ చరిత్రలోనే ఒక ఇతివృత్తంగా మారింది. 1940ల ప్రారంభంలో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు, భదాసే కరోని నది నుండి ఇసుక తవ్వడం ప్రారంభించి, ఒక ట్రక్కు కొని, ఒక చిన్న రవాణా వ్యాపారాన్ని నిర్మించాడు. వలసరాజ్యమైన ట్రినిడాడ్‌లో వస్తువులు ఎలా రవాణా చేస్తారో, ఒప్పందాలు ఎలా కుదుర్చుకుని డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ సైన్యం వచ్చి చగురమాస్‌లో ఒక భారీ నావికా స్థావరాన్ని నిర్మించినప్పుడు, కాంట్రాక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అప్పుడే భదాసే సంస్థ ట్రినిడాడ్లోని అతిపెద్ద సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
యుద్ధం ముగిసి, అమెరికన్లు తమ స్థావరాలను ఖాళీ చేసేటప్పుడు, భూదాసె అక్కడి విశాలమైన భూభాగాలను మరియు భారీ పరిమాణంలో మిగులు సరుకులను ముందు చూపుతో తక్కువ ధరలకే కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించి, 30 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. 1950వ దశకానికి ముందు, ట్రినిడాడ్లోని హిందూ సమాజం ఒకే ఐక్య కూటమిగా లేదు. ఆ పరిస్థితి వలస రాజ్యానికి బాగా ఉపయోగపడింది. అదే సమయంలో, క్రైస్తవ మిషనరీలు ఆ ద్వీపమంతటా పాఠశాలలను స్థాపించాయి. 1952లో, భదాసే ప్రధాన హిందూ సంస్థలను ఒకే సంస్థగా విలీనం కావడానికి ఒప్పించారు. అదే సనాతన ధర్మ మహా సభ. పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన మహా సభ, ట్రినిడాడ్ హిందువులకు ఒక కేంద్రీకృత మత అధికార సంస్థగా మారింది. భూదాసే దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికై, మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. హిందూ సమాజానికి ఇంతకు ముందు ఎన్నడూ లేని ధైర్యం ఇచ్చి, ప్రభుత్వాన్ని కేవలం వేడుకోవడం కాకుండా, చర్చలతో సమస్యలు పరిష్కరించే స్థాయికి తీసుకెళ్లారు.
1952లో మహా సభ తన సొంత పాఠశాలలను నిర్మించి, నిర్వహించడానికి అనుమతి పొందిన తర్వాత, భదాసే దూకుడుగా వ్యవహరించారు. 1952 - 1956 మధ్య, మహా సభ ట్రినిడాడ్ అంతటా ముప్పై ఒక్క ప్రాథమిక పాఠశాలలను నిర్మించింది. వాటిలో చాలా వరకు ఆయన విరాళంగా ఇచ్చిన భూమిలో నిర్మించారు. అందుబాటులో ఉన్న సామాగ్రితోనే ఆ భవనాలు త్వరగా నిర్మించారు. పట్టణ ఉన్నత వర్గాలు, వలస అధికారులు ఆ కట్టడాలను చూసి నవ్వారు. వారు వాటిని "గోశాలలు" అని పిలిచారు. అసలు చదువుకోకపోవడం కంటే గోశాలలో చదువుకోవడం ఒక బిడ్డకు మేలు. ఆ ఒక్క వాక్యమే ఆయన మొత్తం దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆయన వలసవాదుల దృష్టిని ఆకట్టుకోవడానికి సంస్థలను నిర్మించలేదు. తరతరాలుగా విలువ లేకుండా బతికిన చెరకు పండించే ప్రాంతంలోని పిల్లల కోసం ఆయన వాటిని నిర్మించారు. అలాగే హిందూ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును సాధించే ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించి విజయం సాధించారు. తద్వారా హిందూ కుటుంబ జీవితానికి, క్రైస్తవ వివాహాలతో సమానమైన హోదా ఉండాలని ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి చేశారు.
తమ వారికి దహన సంస్కారాలు చేయాలనుకున్న అనేక హిందూ కుటుంబాలు, శశ్మాన వాటికలు లేకపోవడంతో చెత్తకుండీల వద్ద ఆ పని చేయవలసి వచ్చేది. భదాసే ఈ అవమానాన్ని కూడా సవాలుగా తీసుకుని విజయం సాధించారు. హిందూ అంత్యక్రియలను కనీస గౌరవంతో చూసేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. శాసనసభలో హిందువులకు గొంతు లేకపోతే, వలస ప్రభుత్వం వారిని ఎప్పటికైనా అణగదొక్కుతుందని, భూదాసే 1950లోనే ట్రినిడాడ్ శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా సీటు గెలుచుకున్నారు. 1953 నాటికిసొంత రాజకీయ పార్టీని స్థాపించి, హిందూ సమాజం, చెరకు కార్మికుల గొంతు మార్మోగేలా చేశారు. 1957 నాటికి, ఆఠయన డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1958 ఫెడరల్ ఎన్నికలలో, ఆ సంకీర్ణ కూటమి అధికార పార్టీని ఆరు సీట్లకు నాలుగు సీట్ల తేడాతో ఓడించడం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత మైలురాయి.
తర్వాత ట్రినిడాడ్ స్వాతంత్ర్యం వైపు సాగుతున్న అత్యంత కీలకమైన సమయంలో భదాసే అనారోగ్యంతో మంచానికే పరిమితమవ్వడం, రాజకీయ శూన్యతను సృష్టించింది. ఆయన పార్టీ చీలిపోయింది. ఆ క్రమంలో యూఎస్, యూకేల్లో చికిత్స పొంది కోలుకున్న భూదాసే హిందూ మహాసభకు, కార్మిక సంఘానికి నాయకత్వం వహించడానికి తిరిగి వచ్చారు. కానీ ఇండో ట్రినిడాడియన్లు స్వతంత్ర్య దేశాన్ని నిర్దేశించే అవకాశం అప్పటికే చేజారింది.
భదాసే 21 అక్టోబర్ 1971 అక్టోబర్ 21న 51 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన కథ జాతీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కొద్దిలో విఫలమైన నాయకుడిగా మిగిలింది. అయితే తర్వాతకాలంలో విమర్శకులు ఎగతాళి చేసిన ఆ గోశాల పాఠశాలలు, కరేబియన్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలుగా మారాయి. ఆయన మరణానంతరం కూడా, ఆయన పోరాటం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. చాలా సంవత్సరాలుగా, దేశ అత్యున్నత పురస్కారాన్ని ట్రినిటీ క్రాస్ అని పిలిచేవారు, ఈ పేరు క్రైస్తవ ప్రతీకలతో నిండి ఉంది. ఒక హిందూ పండితుడు మతపరమైన కారణాలతో ఆ పురస్కారాన్ని తిరస్కరించినప్పుడు.. ఆ తిరస్కరణ చర్య దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దాంతో ఆ పురస్కారానికి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అని పేరు మార్చారు. 1950లలో భదాసే చేసిన మునుపటి పోరాటాలు ఇప్పటికీ అక్కడి హిందూ సంఘాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త హిందూ మత నాయకుడు అయిన భదాసేను అక్కడి వారు 'బాబా' , 'ట్రినిడాడ్ సింహం' అని పిలిచేవారంటే ఆయన గొప్పదనం అర్థమవుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





