పావుగంటకో ప్రాణం.. క‌డ‌ప‌లో మ‌రీ ఘోరం.. పాల‌కులే చేతులెత్తేస్తే ఎలా?

అండ‌గా ఉంటార‌ని అంద‌లం ఎక్కిస్తాం. క‌ష్టాల్లో ఆదుకుంటార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తాం. అస‌లు, ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలే రాకుండా చూస్తార‌ని ఆశిస్తాం. కానీ, తీరా గ‌ద్దె నెక్కాక‌.. ఆ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డమే మానేస్తారు కొంద‌రు నేత‌లు. రాష్ట్ర ప్ర‌జ‌లు క‌రోనాతో అల్లాడిపోతున్నా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మొద్దు నిద్ర‌లో జోగుతున్నారంటూ విమ‌ర్శ‌లు. ఏపీని ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తున్నా.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ మండిపాటు. ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప‌లో ఆక్సిజ‌న్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. కేంద్రానికి లేఖ‌లు రాస్తూ.. త‌ప్పును ఢిల్లీపైన నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్నా.. చేష్ట‌లుడిగి చూస్తూ.. చేతులెత్తేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అంటూ విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. 

అవును, ఏపీలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. రాష్ట్రంలో పావుగంట‌కో ప్రాణం పోతోంది. ఒక్క రోజే 96 మంది మృత్యువాత ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీలో మ‌రోసారి 20వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోద‌వ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. ఏపీలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 12,65,439కు చేరాయి. మొత్తం యాక్టివ్‌ కేసులు 1,87,392 కాగా.. మొత్తం మరణాలు 8,615కు పెరిగాయి. తాజాగా 19,272 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.  

ఏపీలో కొవిడ్ మ‌ర‌ణాలు సెంచ‌రీ కొడుతుండ‌టం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. పావు గంట‌కు ఒక‌రు చ‌నిపోతున్నారంటే అదేమైన చిన్న విష‌య‌మా?  వైర‌స్ ముదిరి ప్రాణాలు పోతున్న వారికంటే.. ఆక్సిజ‌న్ లోటు, బెడ్స్ కొర‌త‌తో.. స‌రైన చికిత్స అంద‌క చ‌నిపోతున్న వారే ఎక్కువ మంది ఉంటున్నార‌ని అంటున్నారు. ఇవి, కొవిడ్ మ‌ర‌ణాలు కావ‌ని.. పాల‌కుల నిర్ల‌క్ష్యం, చేత‌గాని త‌నం వ‌ల్ల జ‌రుగుతున్న హ‌త్య‌ల‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోతున్న మ‌ర‌ణాల్లో దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో ఉండ‌టం.. ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల‌మ్యే. ఆ పాపం.. పాల‌కుల‌దే. 

ఏప్రిల్ 13 నుంచి మే 6 మ‌ధ్య సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం.. ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయిన వారి సంఖ్య‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంటే.. 40కి పైగా మ‌ర‌ణాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యావ‌త్ దేశంలోనే రెండో స్థానంలో నిల‌వ‌డం పాల‌కుల ఉదాసీన వైఖ‌రికి సాక్షం. ఏపీ సిగ‌లో విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఉన్నా.. అక్క‌డ ట‌న్నుల‌కు ట‌న్నులు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతున్నా.. ఏపీలో భారీగా ఆక్సిజ‌న్ కొర‌త ఉండ‌టం.. ప్రాణ వాయువు అంద‌క రోగులు పిట్ట‌ల్లా రాలిపోతుండ‌టం.. ప్ర‌భుత్వ చేత‌గాని త‌న‌మే కాక మ‌రొక‌టి కాదంటున్నారు. ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, స‌ర‌ఫ‌రా, అందుబాటుపై జ‌గ‌న్‌రెడ్డి స‌రైన చ‌ర్య‌లు చేపట్ట‌క పోవ‌డమే ప్ర‌స్తుత చావుల‌కు కారణ‌మ‌ని చెబుతున్నారు. 

ఏపీ వ్యాప్తంగానే కాదు.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ వైర‌స్ కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. క‌నీసం సొంత జిల్లాపైనైనా స‌రైన‌ దృష్టి పెట్ట‌ని అస‌మ‌ర్థ పాల‌కులు అధికారంలో ఉండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఇటీవ‌ల క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కి రాసిన లేఖ‌.. క‌డ‌ప జిల్లాలో కొవిడ్ క‌ల్లోలం, ఆక్సిజ‌న్ కొర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. క‌డ‌ప జిల్లా ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉందంటూ.. లెక్క‌ల‌తో స‌హా కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖ రాశారు. 

అయినా.. ఓ జిల్లా స‌మ‌స్య‌ను కేంద్రం నేరుగా ఎలా తీర్చ‌గ‌ల‌దు? మ‌రి, క‌డ‌ప జిల్లాను అంతగా ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తుంటే.. రాష్ట్రానికి కావ‌ల‌సినంత ఆక్సిజ‌న్‌ను ర‌ప్పించుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాలేంటి?  సీఎం జ‌గ‌న్‌రెడ్డి విఫ‌లం అయ్యారు కాబ‌ట్టే.. ముఖ్య‌మంత్రి వ‌ల్ల కావ‌డం లేదు కాబ‌ట్టే.. ఎంపీ అవినాశ్‌రెడ్డి నేరుగా కేంద్రానికి లెట‌ర్ రాశారని అనుకోవ‌చ్చా? అంటే, త‌మ ముఖ్య‌మంత్రి క‌రోనా విష‌యంలో అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యార‌ని ఆయ‌నే ప‌రోక్షంగా ఒప్పుకుంటున్న‌ట్టేనా?  విశాఖ ఉక్కు క‌ర్మాగారం నుంచి ఎక్క‌డెక్క‌డికో ఆక్సిజ‌న్ అందిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఇంత‌లా ప్రాణ‌వాయువు కొర‌త ఉంటే.. సీఎం కుర్చీలో కుర్చున్న జ‌గ‌న్‌రెడ్డి ఏం చేస్తున్న‌ట్టు?  ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలోనే ఇంత‌లా మెడికల్ ఆక్సిజ‌న్ డిమాండ్ ఉంటే.. ఆ జిల్లా వాడై కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటే.. ఇక మ‌న ముఖ్య‌మంత్రిని ఏమ‌నాలి?  నీరో చ‌క్ర‌వ‌ర్తిలా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌రెడ్డిని ఇంకెంత‌లా త‌ప్పుబ‌ట్టాలి?  ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేదా? క‌రోనా క‌ట్ట‌డికి ప్యాలెస్ వీడి బ‌య‌ట‌కు రారా?  ప్ర‌జాక్షేత్రంలో ప‌ర్య‌టించి.. వాస్త‌వ ప‌రిస్థితులు, రోగుల క‌ష్ట‌, న‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌రా? అయినా, సొంత జిల్లాలో ఆక్సిజ‌న్ కొర‌త‌నే తీర్చ‌లేని ముఖ్య‌మంత్రి.. ఇక రాష్ట్రంలోని మిగ‌తా రోగులను ఎలా ఆదుకుంటారు? క‌రోనా మ‌హ‌మ్మారిని ఇంకేం క‌ట్ట‌డి చేస్తారు? అంటున్నాయి విప‌క్షాలు.