క్యాలెండర్ కోసం లక్షల్లో ఉద్యోగం వదిలేసిన షణ్ముఖ

ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అక్కడ జరిగే మానవాభివృదికి సాహిత్యం మరకతమణి కిరీటం లాంటిది. అందులో భాగమైన కథ, కవిత్వం, నవల, జానపదం ఇలా అనేక సాహిత్య ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేసి జన జాగృతికి అపార అక్షర సంపదను ఇచ్చి వెళ్లిన మహానుభావులను ప్రస్తుతం యువత ఎంతమంది గుర్తుపట్టగలరు అంటే వేళ్లపై లెక్కపెట్టవచ్చు. మన అడుగుజాడ గురజాడ, అక్షరాలను నిప్పులు చేసి దోసిల్లో ఆడుకున్న శ్రీశ్రీ, భావ కవిత్వం దేవులపల్లి ఇంకా ఎందరో మహానుభావులు ఎన్నో రచనలు చేసి సమాజం మనో ఫలకం పై చెరగని చైతన్యపు సంతకం చేసి వెళ్లారు. విశాలమైన సాహితీ వనంలో పూలై విరాజిల్లుతున్నారు. అనంతపురం కదిరికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు సున్నపురాళ్ల శ్రీనివాస్, ధర్మపత్నీ యశోద వారి కుమారులు షణ్ముఖ ముగ్గురూ కలిసి రేపటి తరం కోసం ప్రముఖ రచయితల ముఖచిత్రాలతో " తెలుగు సాహితీ కాల చక్రం" పేరుతో క్యాలెండర్ (కాలమాని) ని ముద్రించి నేటి సమాజం నిత్యం వారిని దర్శించే మహత్తర కర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ మహాప్రస్థానమైనా ఆటుపోటులతోనే ప్రారంభం అవుతుంది. అలాగే వీరి ప్రయాణం కూడా అంతే! మీకెందుకు ఖర్చు? ప్రభుత్వాలకే పట్టకుంటే సొంత ఖర్చులతో ఇలా చేయడం కరెక్ట్ కాదని బంధువులు స్నేహితులు చెప్పారు. కొంతమంది నిందించారు. కానీ వారు వెనకడుగు వేయలేదు. మహా సంకల్పంతో ముందుకు కదిలారు.

*తల్లిదండ్రుల బాటలో కుమారుడు షణ్ముఖ

ముఖ్యంగా వారి కుమారులు షణ్ముఖ గురించి చెప్పాలి. ఎం బి ఏ పట్టభద్రుడు. బెంగళూర్ లో లక్షల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ వదిలేసి గత మూడు నాలుగేళ్లుగా ఇదే కార్యక్రమంలో అంకితమయ్యారు అంటే వారి కృషి అనిర్వచనీయం అని చెప్పాలి. క్యాలెండర్ లను ముద్రించడం ఒక ఎత్తయితే  పరమపదించిన రచయితల నిజ సమాచార సేకరణ ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అరుదైన వారి చిత్రాలు, రచనల సేకరించడంలో కుమారుడు షణ్ముఖ చేసిన చేస్తున్న కృషి అద్భుతం. 

* సాహితీ కాలమానం క్యాలెండర్

వీరి కృషి వలన గోడకు వేలాడే క్యాలెండర్ సాహితీమూర్తుల చిత్రాలతో కొత్తగా అలంకరించుకుంది. ఈ క్యాలెండర్ లో ప్రతి నెల పేజీ లో ఆ నెలలో జన్మించిన మరియు మరణించిన తెలుగు రచయితల చిత్రాలు జనన మరణ తారీకుల్లో అందంగా ఆకర్షణీయంగా ముద్రించబడ్డాయి. తేదీలకు ఒకవైపు మహోదయం పేరిట ఆ నెలలో పుట్టినవారిని, మరోవైపు మహాస్తమయమని చనిపోయినవారివి ఉన్నాయి. ఇలా ఈ క్యాలెండర్ లో 160 మంది రచయతల్ని పరిచయం చేస్తూ సాహితీ కాలమానం క్యాలెండర్ రూపుదిద్దుకుంది. దీని మూలంగా నేటి తరానికి మన రచయతులెవరో తెలిసే అవకాశం ఉంది. ఈ క్యాలెండర్ మన విద్యాలయాల్లో గ్రంధాలయాల్లో, వసతి గృహాల్లోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఇలా ఉండటం వలన ఏదొక సందర్భంలో మన రచయితల గురించి వారి రచనల గురించి చర్చకు వస్తుంది. తద్వారా సాహిత్యం ప్రాధాన్యత పెరిగి మాతృ బాష యొక్క విలువ ఏంటో నేటి టెంగ్లీష్ యువజనానికి తెలుస్తుంది.

 

*ఉపరాష్ట్రపతి ప్రశంసలు

దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ ప్రస్తుతము దేశభాషలందు తెలుగు లెస్సు అనేలా ఉంది పరిస్థితి అని ఒక సందర్భంలో బాధపడ్డారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అయితే శ్రీనివాస్ భార్య యశోద కుమారులు షణ్ముఖ త్రయం చేస్తున్న సాహిత్య కృషి,బాషాభివృద్ది గురించి తెలుసుకొని సంతోషించి అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారు ఉపరాష్ట్రపతి.

*ఆదర్శనీయం

ఇష్టమైన పనిని చేసుకు వెళ్తుంటే ఆ ప్రయాణంలో దొరికే ఆ సంతృప్తి వేరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగే వారి విజయాలు ఎంత కష్టాన్నైనా కరిగిస్తాయి. తెలుగు సాహితీ సేవలో కొత్త కోణాన్ని ఎంచుకున్న ఈ ఉపాధ్యాయ కుటుంబం అందరికీ ఆదర్శనీయం. ముఖ్యంగా కుమారుడు షణ్ముఖ కృషి అనిర్వచనీయం. వీరు సేకరించిన సమాచారం తెలుగు జాతికి, భాషకు ఎంతో విలువైనది. ఏదొక రూపంలో అది ప్రతి ఇంటికీ చేరాల్సిన అవసరముంది. ముగ్గురు వ్యక్తుల స్తోమతకు, శ్రమకు మించిన కార్యక్రమం ఇది. ఈ మహా సంకల్పం నిర్వఘ్నంగా సాగాలంటే బాషాప్రేమికులు,సాహితీ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు కలిసి తోడు నిలవాల్సిన సమయం ఇది. ఇప్పటికే కొంతమంది ముందుకొచ్చి బాధ్యతగా తాము చదువుకున్న లేదా సొంతూరు పాటశాల కు ఈ క్యాలెండర్స్ ని బహుకరిస్తున్నారు.
తెలుగు సాహితీ కాలచక్రం క్యాలెండర్ కావాలని తలిచినవారు 9492087089 కి కాల్ చేసి షణ్ముఖను సంప్రదించండి.

◆ వెంకటేష్ పువ్వాడ