తెలంగాణ తెలుగుదేశం.. చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి!?
posted on Oct 13, 2025 2:22PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలీయ శక్తి అనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో బలీయంగా ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా జరగడం లేదు. ఏమైనా సమావేశాలు జరిగినా, జరిపినాఅవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితం అవుతున్నాయి తప్ప.. జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు.
అయినా.. పార్టీ రాజకీయంగా తెలంగాణలో క్రియాశీలంగా లేకపోయినా, పార్టీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు ఏదీ లేకపోవడంతో.. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు కోసం తెలుగుదేశం క్యాడర్ వైపు చూడటం ఆనవాయితీగా మారిపోయింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కేడర్ కు అధినాయకత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్ రాని పరిస్థితుల్లో.. కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారంతట వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు.
సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవు అన్న సంగతి తెలిసిందే. అయితే కార్యకర్తల బలం మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తార్కానం. అన్ని పార్టీలూ కూడా ఆ ఎన్నికలలో తెలుగుదేశం జెండా మోయడానికి పోటీలు పడడమే.
తెలంగాణలో తెలుగుదేశం వెనుకబాటుకు కారణం నాయకులు కరవవ్వడమే అన్న విషయంలో సందేహం లేదు. ఆ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం క్యాడర్ బలంతోనే తాము గెలిచామని చెప్పుకోవడానికి ఇసుమంతైనా సంకోచించరు. అంతటి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం తెలంగాణలో విస్తరించడానికి అన్ని అవకాశాలూ ఉన్నా నాయకత్వం మాత్రం ఆ దిశగా పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు క్యాడర్ లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత.. తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటుందని ఆశించిన క్యాడర్ ఇప్పుడు పార్టీ అధినాయత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
ఆ స్థానిక ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ క్యాడర్ అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అసలు జూబ్లీ బైపోల్ లోనే తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని క్యాడర్ డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా ఉన్న పరిమితులను విడమర్చి చెప్పి సముదాయించారు. అయితే స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అలా సముదాయించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.