బెజవాడ కనక దుర్మమ్మకు తెలంగాణ బంగారు బోనం

తెలుగు రాష్ట్రాల అవినాభావ సంబంధానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయానికి నిదర్శనం ఏటా బెజవాడ కనకదుర్గమ్మ  అందుకునే తెలంగాణ బంగారు బోనం. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే అనడానికి రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంప్రదాయం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుండటమే నిదర్శనం. హైదరాబాద్ లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రోజు బంగారు బోనం అందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది.

ఆ పండుగ సందడి ఏపీలో కూడా ప్రతిఫలిస్తుంది. అందులో భాగమే తెలంగాణలో తొలి బోనం సమర్పించే రోజునే బెజవాడ కనకదుర్గమ్మకూ బోనం సమర్పించడం. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతి ఏటా ఆషాఢమాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడు కూడా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించినట్లు మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారుజ.  అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికిపైగా కళాకారులు విజయవాడకు చేరుకుని ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి  బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, తీన్‌మార్‌ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.