నవంబర్ 19న బతుకమ్మ చీరలు పంపిణీ
posted on Oct 21, 2025 12:38PM

తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంచింది. మహిళా శక్తితో పేరుతో వీటిని పంపిణి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్దం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ చేసి 19న పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా చీరలను ఇవ్వడం ప్రారంభించింది.
సరిగ్గా బతుకమ్మ నాటికి చీరలను పంపిణీ పూర్తి చేసేది. అయితే బీఆర్ఎస్ సర్కార్ పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు ఇస్తామని ప్రకటించింది. అందుకోసం చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారీ చేయిస్తున్నారు.