తెలుగుదేశం తోరణాలు తొలగింపు..వైసీపీ కార్యకర్తల్లా కార్పొరేషన్ అధికారులు

తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే అధికార వైసీపీలో భయం పెరుగుతోంది. ఆ పార్టీ అదినేత జనం పర్యటనకు జనం పోటెత్తడం, వైసీపీ అధినేత, సీఎం జగన్ సభల నుంచి జనం పారిపోవడంతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యక్రమాలను అడ్డుకోవడం, పార్టీ నేతలకు కార్యకర్తలపై దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.  ఒంగోలులో ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కు ఒక వైపు తెలుగుదేశం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరోవైపు ఆ ఏర్పాట్లను విచ్ఛిన్నం చేయడంలో కార్పొరేషన్ అధికారులు యమా బిజీగా ఉండటానికి కారణమిదేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహానాడు కార్యక్రమం కోసం తెలుగుదేశం తమ్ముళ్లు తొరణాలు కడితే వాటిని వైసీసీ నాయకుల ఒత్తిడి కారణంగా కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం తోరణాలను తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ చర్యను నెటిజన్లు గర్హస్తున్నారు.  

మహానాడు కార్యక్రమం కోసం అనుమతి తీసుకున్న తరువాత కూడా ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏం పద్ధతి అని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లను మహానాడుకు వాహనాలు ఇవ్వరాదని ట్రాన్స్ పోర్టు శాఖ అధికారులు బెదరించడం వైసీపీలో ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం వైసీపీ కనుసన్నలలో పని చేస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.