స్టాలిన్.. ఒకే ఒక్కడేనా?

యువ ముఖ్యమంత్రులు సమాజంలో రుగ్మతలను నిర్మూలించడానికి, అన్యాయాలను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ జనం మన్ననలు పొందడం వంటి ఘటనలు ఎక్కువగా సినిమాలలోనే చూస్తుంటాం. భరత్ అనే నేను, ఒకే ఒక్కడు ఆ కోవలోనివే. ఆ సినిమాలలో హీరో ముఖ్యమంత్రిగా అద్భుతంగా ప్రజా ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుని విలన్ల కుట్రలతో కొలువు కోల్పోతే..జనం మళ్లీ సీఎంగా ఆయననే అందలం ఎక్కిస్తారు.

వాస్తవంగా రాజకీయాలలో అటువంటి ఘటనలూ ఉండవూ, అలాంటి డ్రామా పండదు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తీరు మాత్రం మిగిలిన రాజకీయ నాయకులకు ఒకింత భిన్నంగా ఉంటుంది. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా కనబడే ఆయన జనం నుంచి వచ్చే ఫిర్యాదులపై క్షణాలలో స్పందిస్తుంటారు. తన విధాన నిర్ణయాలలో విపక్షాలనూ భాగస్వాములను చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలతో అధికారులను గాభరా పెడుతుంటారు. వారికి చెమట్లు పట్టిస్తుంటారు. తాజాగా ఒక అనాథ బాలల పాఠశాల నుంచి ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా ఆ పాఠశాలను సందర్శించారు.

సీఎం స్టాలిన్ ఆ పాఠశాలకు వెళ్లే సరికి ఇంకా ఎవరూ విధులకు హాజరు కాలేదు. నిర్ణీత సమయం దాటినా ఎవరూ రాకపోయే సరికి మరో అరగంట పాటు ఆయన వారి కోసం అక్కడే ఎదురు చూశారు. పాఠశాల, హాస్టల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న విద్యార్థులనుంచి వివరాలు సేకరించారు. టీచర్లు ఎవరూ సమయానికి రారనీ, హాస్టల్ లో సరైన వసతులు లేవనీ, చివరకు భోజనం కూడా సరిగా ఉండదన్న విద్యార్థుల సమాచారంతో ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. మొత్తం సిబ్బందిని సస్పెండ్ చేసేశారు. ఏదో సినిమాలో సన్నివేశంలా అనిపించినా... వాస్తవంగా స్టాలిన్ చేసింది అదే. ఈ చర్యతో స్టాలిన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు.

ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించడాన్ని కొనియాడుతున్నారు. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని జనం అంటున్నారు. ఏది ఏమైనా తమిళరాజకీయాలలో స్టాలిన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటే బెటర్ అని జనం అనుకుంటున్నారు.